ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మించాలి…

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మించాలి…

వెల్దండ , ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లను పూర్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, మేట్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, వివిధ దశలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా గృహప్రవేశాలు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారిస్తూ, ఈ నెలాఖరు నాటికి 100 శాతం ట్యాక్సులు వసూలు చేసి ట్రెజరీలో జమ చేయాలని స్పష్టం చేశారు.


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలుపై కూడా విస్తృతంగా చర్చించారు. పనుల్లో ఎక్కువ మంది కూలీలను నియమించడంతో పాటు, పని ప్రదేశాల్లో త్రాగునీరు, మెడికల్ కిట్, షేడ్ నెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అలాగే ఎన్.ఎం.ఎం.ఎస్ ( NMMS) అటెండెన్స్‌ను 100 శాతం నమోదు చేయాలని, నర్సరీలలో షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా సర్పంచుల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ద్వారా పనిముట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 2, 2026 వరకు పొడిగించినందున, ఈ విషయాన్ని గ్రామాలల్లో సర్పంచ్ ల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశించారు.


అదనంగా, గ్రామ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల ఏర్పాటు కోసం సంబంధిత శాఖ నుంచి వచ్చిన నమూనా ఫారాలను అంగన్వాడీ టీచర్ల ద్వారా సేకరించి పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీఓ లక్ష్మణ్నాయక్ , ఏపిఓ ఈశ్వర్ జి , హౌసింగ్ ఏఈ పల్లవి, ఈసీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply