హోసూరులో పోలీసుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

వైసీపీ నేత శ్రీనివాసులను స్టేషన్‌కు తరలించే యత్నం
అడ్డుకున్న గ్రామస్తులు.. పోలీసులతో వాగ్వాదం
వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులపై లాఠీచార్జి
కొద్దిసేపటికే శ్రీనివాసులను విడిచిపెట్టిన పోలీసులు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత బనగాని శ్రీనివాసులను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సీఐ జయన్న ప్రయత్నించడంతో గ్రామంలో వివాదం చెలరేగింది. ఎలాంటి కారణం లేకుండా శ్రీనివాసులను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తూ గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

శ్రీనివాసులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులపై లాఠీచార్జి చేసినట్లు సమాచారం. కొద్దిసేపు హోసూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వైసీపీ నేత బనగాని శ్రీనివాసులను పోలీసులు విడిచిపెట్టడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసుల చర్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.