పలాస వద్ద ఘోర ప్రమాదం

లారీ దూసుకెళ్లి 75 గొర్రెలు మృతి
మరో 40 గొర్రెలకు తీవ్ర గాయాలు
లారీ స్వాధీనం, డ్రైవర్ పరార్.. కేసు నమోదు
పలాస, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ గొర్రెల మంద‌పైకి దూసుకెళ్లడంతో 75 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 40 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. పలాస మండలం మూడు గ్రామాలకు చెందిన ఏడుగురు గొర్రెల కాపరులు తమ మందను జాతీయ రహదారి దాటిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

జాతీయ రహదారిపైకి అతివేగంతో వ‌చ్చిన లారీ ఒక్కసారిగా గొర్రెలపైకి దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి 75 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని, మరో 40 గొర్రెలు తీవ్రంగా గాయపడినట్లు పలాస పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మట్ట రవికుమార్ ధ్రువీకరించారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. దీంతో గొర్రెల కాపరులు, స్థానికుల సహాయంతో లారీని వెంబడించారు. లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద లారీని వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పరారైన డ్రైవర్, క్లీనర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంతో తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని, అధికారులు స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో ఒక కాపరికి గాయాలైయి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.