చేవెళ్లలో ఘోర ప్రమాదం.. భార్య భర్తలు, ఆరేళ్ల బాలుడు మృతి..
చేవెళ్ల, ఆంధ్రప్రభ: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్–కంది లింకు జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం గొల్లపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో భార్యాభర్తలు, వారి కుమారుడు ఉన్నారు. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది.

బంధువులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(36), ఆయన భార్య సావిత్రి(30), కుమారుడు ధనుష్(6), కుమార్తె అక్షయ(9) ద్విచక్ర వాహనంపై చేవెళ్ల మండలం చన్‌వెల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గొల్లపల్లి స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు, సావిత్రి, ధనుష్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. అక్షయకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్వల్ప గాయాలైన అక్షయకు అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
