గిరిజన విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
టోల్‌ఫ్రీ, వాట్సాప్ నంబర్లు ప్రారంభించిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు.
గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి విద్యాసంస్థల పనితీరు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులను అభినందించాలని సూచించారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నంబర్లు
విద్యార్థుల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ, వాట్సాప్ నంబర్ల మంత్రి 1800-425-3369, వాట్సాప్ నంబర్: 9493368361లను ప్రారంభించారు. గురుకులాలు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఈ నంబర్ల ద్వారా తెలియజేయవచ్చని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, ఐటీడీఏ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
