- ఆరువారాల్లో ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వానికి ఆదేశం
- సర్కార్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఫీజులు
- ప్రైవేటు కళాశాలలకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్ : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో బిగ్ షాక్ తగిలింది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను విడుదల చేసింది. ఆరు వారాలలోపు ఇంజినీరింగ్ ఫీజుల (Engineering fees) ను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.
ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ప్రైవేట్ కళాశాలలు (Private colleges) ఎదురు చూస్తున్న ఫీజుల పెంపు ఆశలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే నిర్వహాణ ఖర్చులు పెరిగాయని, నాణ్యమైన విద్యకు తగిన వనరులు కావాలంటూ ప్రైవేట్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు మాత్రం చట్టపరమైన ప్రక్రియలో ముందుకెళ్లాలని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, ఫీజుల పెంపుపై స్పష్టత రానంత వరకూ అడ్మిషన్ ప్రక్రియలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.
ఫీజు పెంపుకు చైతన్య భారతికి హైకోర్టు అనుమతి. .
2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ కళాశాల వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేయాలని తెలంగాణ ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, ఎంటెక్ కోర్సుకు రు.1,51,600, ఎంబిఎ, ఎంసిఎ కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు చైతన్యకు అనుమతించింది. పెరిగిన ఫీజులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది..