కట్టుకున్న మొగుడే కాలయముడు..

  • అడ్డువచ్చిన అత్తపైనా దాడి.. పరిస్థితి విషమం

ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : కట్టుకున్న భార్యపై భర్త దాడి చేయగా.. అడ్డుకునేందుకు వచ్చిన అత్తపైనా దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందగా, అత్త తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిర గ్రామానికి చెందిన గండికోట ఎల్లవ్వ కుమార్తె జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన పల్లెపు సురేష్‌తో వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జ్యోతి కొంతకాలంగా తన తల్లి ఎల్లవ్వ వద్ద ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జ్యోతి తల్లి ఇంటి వద్ద ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన సురేష్‌ ఆమెతో గొడవకు దిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో సురేష్‌ జ్యోతిపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. కూతురిపై దాడిని గమనించిన ఎల్లవ్వ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపైనా సురేష్‌ దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో జ్యోతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కూతురిని కాపాడేందుకు ప్రయత్నించిన ఎల్లవ్వ కూడా తీవ్రంగా గాయపడింది.

తీవ్ర గాయాల కారణంగా ఎల్లవ్వ అపస్మారక స్థితికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జ్యోతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనతో పదిర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు అక్కడికి చేరుకుని ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులు, కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.