Rain Alert | 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌…

ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షాలకు అవకాశం


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 కిలోమీటర్లలోపు వేగంతో ఈదురుగాలులు వీచొచ్చని వాతావరణశాఖ తెలిపింది.

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసే పరిస్థితులు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాల కింద ఉండొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచొచ్చని హెచ్చరించారు. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వాతావరణశాఖ, అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.