విజయవాడలో భారీ వర్షం.. రహదారులన్నీ జలమయం
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కొద్దిసేపటికే ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ద్విచక్ర వాహనాలు, కార్లు నీటిలో చిక్కుకుపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిని తొలగించేందుకు సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు.
