హైదరాబాద్ : తెలంగాణలో రెండుమూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజుల క్రితం కుండపోత వర్షంతో నగర ప్రజలు అతలాకుతలం అయ్యారు.
అయితే, మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బుధ, గురువారాల్లో హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు, ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఇవాళ (బుధవారం) ఉదయం నుంచి రేపటి (గురువారం) ఉదయం వరకు అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.భారీ వర్షాలకు తోడు గంటకు 40 – 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున చెట్ల కింద నిలబడొద్దని, రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.1 సెంటీమీటర్లు, మంచిర్యాలీ జిల్లా నస్పూర్ లో 8.4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో 7.5 సెంటీమీటర్లు, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడటం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.