- ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరిక
- రుతుపవనాలు ప్రవేశించినా హస్తినలో మారని స్థితి
న్యూఢిల్లీ : దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఢిల్లీలో ప్రస్తుతం 52డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఢిల్లీ, పంజాబ్ (Punjab) లో కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండలు ఎక్కువగా ఉంటాయని.. సాయంత్రం మాత్రం ఉపశమనం లభించొచ్చని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
బయటకు వెళ్లోద్దు…
ఇక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మధ్యాహ్నం (afternoon) సమయంలో ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నీరు ఎక్కువగా తాగాలని, తలతిరగడం, అలసట, గుండె కొట్టుకోవడం వంటి వడదెబ్బ లక్షణాల కోసం జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు ప్రజలను కోరారు. వేడిగాలులతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. చిన్న పిల్లలు, వృద్ధులు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఉత్తరాదిలో భానుడి భగభగలు
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ వారంలో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 20 నాటికి హిమాచల్ ప్రదేశ్‌కు, జూన్ 27 నాటికి పంజాబ్‌కు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేసింది.
