కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందేలా చూడటం అత్యంత కీలకమని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. పోషకాహార లోపాన్ని కేవలం ఆహార సమస్యగా చూడకుండా.. రక్తహీనత, ఎదుగుదల లోపం, క్షీణత, తక్కువ బరువు, పెరుగుతున్న ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సవాళ్లను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్‌లోని ఏవీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌లో సెప్టెంబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల పోషణ అవగాహన కార్యక్రమం ముగిసింది. 9వ రాష్ట్రీయ పోషణ్‌ మాహ్‌ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు వేడుకలకు కేంద్ర మంత్రి హాజరై మాట్లాడారు.

పోషకాహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి సమగ్ర పోషణ పథకం, సక్షమ్‌ అంగన్‌వాడీ–పోషణ్‌ 2.0, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన వంటి పథకాల ద్వారా పోషకాహార సమస్యను బహుముఖ విధానంతో పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ పోషకాహారం అందేలా ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. పోషకాహారంతో పాటు శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై యువతలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిట్‌ ఇండియా ఉద్యమం, నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలను పోషకాహారంపై కొనసాగుతున్న ప్రయత్నాలతో అనుసంధానించడం ద్వారా ఆరోగ్యకరమైన, దృఢమైన, సవాళ్లను తట్టుకునే భారతదేశాన్ని నిర్మించవచ్చని చెప్పారు.

ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించేలా ఏర్పాటు చేసిన సమాచార ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. పోషకాహారంపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు, సమాచార ప్యానెళ్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోషకాహారం, ఆరోగ్యం, జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.