హైదరాబాద్: హైదరాబాద్ మల్కాజ్‌గిరి కోర్టు బుధవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సహా మరికొంతమంది వ్యక్తులకు ఆరు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది.
కస్టడీకి సీఐడీ దాఖలు..
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, హెచ్‌సీఏ ఖజాంచి జెఎస్ శ్రీనివాస రావు, హెచ్‌సీఏ సీఈఓ సునీల్ కాంతే, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర యాదవ్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జీ కవిత ని గత వారం అరెస్ట్ చేసింది.
ఈ ఐదుగురిని మరింతగా విచారించేందుకు సీఐడీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా… కోర్టు పిటిషన్‌ను పరిశీలించి ఆరు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
కేసు నేపథ్యం
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరం గురువా రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదై, నిధుల దుర్వినియోగం, నకిలీ పత్రాల ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తదుపరి విచారణలో ఇంకా కీలక విషయాలు వెలుగు చూడనున్నాయి.