క్రీడలు విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయి
మండల స్థాయి 70వ ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీలు ప్రారంభం
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : క్రీడలు విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని మండల విద్యాశాఖ అధికారి, మండల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ. శ్రీనివాస్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–13, అండర్–17 బాలబాలికల క్రీడా పోటీలు స్థానిక బాలుర, బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి చెందిన పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు సహకార భావన వంటి సానుకూల లక్షణాలను అలవర్చుతాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బాలికల, బాలుర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నంశెట్టి సుమాదేవి, విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ శివకుమార్, దాత రాము పెగడపెల్లి, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఎస్జీఎఫ్ఐ జిల్లా బాధ్యులు వాసుదేవరావు, శ్రీధర్, స్థానిక పీడీ అధ్యక్షుడు పార్థసారథి, కార్యదర్శి మల్లారెడ్డి, ఎస్జీఎఫ్ఐ మండల కార్యదర్శి శారద, పీడీలు బాలమురళీకృష్ణ, నవీన్‌కుమార్, శ్రీలత, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల పీడీలు తదితరులు పాల్గొన్నారు.
