అసెంబ్లీలో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటు కౌంటర్
- అసెంబ్లీలో ఒక్క ప్రశ్నకూ జవాబు ఇవ్వలేదు
- 22ఏపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: 22ఏ భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు మాట్లాడారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సభలో తమ పార్టీ సభ్యులు లేకుండా చేసి తమపై ఆరోపణలు చేశారని విమర్శించారు.
22ఏ జాబితాలో ఎన్ని ఎకరాల భూములు చేర్చారో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. తాము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. రైతుల భూములను తప్పుగా 22ఏలో చేర్చిన విషయం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి అంగీకరించారని హరీశ్‌రావు తెలిపారు. అయితే ఇందుకు క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 22ఏ జాబితాలో ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఉందని చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మరి సీఎం ఇంటిని ఎప్పుడు తొలగిస్తారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
తన మామ భూముల విషయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తమ మామ భూములు కొనుగోలు చేసిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని తెలిపారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. తన మామ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అని పేర్కొన్నారు. 22ఏ అంశంలో ఎంతోమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పొంగులేటి తప్పు ఒప్పుకున్నారు.. క్షమాపణ మాత్రం చెప్పలేదు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా యాదాద్రిలో 42 వేల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే మంత్రి పొంగులేటి మాత్రం తెలిసో తెలియకో కేవలం 25 వేల ఇళ్లు మాత్రమే ఆ జాబితాలో చేరాయని అబద్ధం చెప్పారని ఆరోపించారు.
“సమయం తక్కువగా ఉందని.. వెరిఫై చేయకుండానే అందరి భూములను నిషేధిత జాబితాలో పెట్టి, తప్పుడు లిస్ట్ అప్‌లోడ్ చేశామని మంత్రి చెప్పారు. కానీ చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పలేదు. భూములను ఎప్పుడు నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారో కూడా స్పష్టం చేయలేదు” అని హరీశ్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు విపక్షాలన్నీ ఆ అంశంపై స్పందించడం సహజమన్నారు.కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నప్పటికీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ఆయన ప్రశ్నించారని తెలిపారు.అదే అంశంపై తాను కూడా ట్వీట్ చేశానని, అంతమాత్రాన బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటైనట్లా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
