harish| మెడికల్ విద్యార్థుల ఆందోళనకు హరీశ్‌రావు మద్దతు
మెడికల్ విద్యార్థుల ఆందోళనకు హరీశ్‌రావు మద్దతు
- మంగళ్‌పల్లిలో ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి
- 26 నెలలుగా విద్యుత్, నీటి బిల్లులు, అద్దె చెల్లించడం లేదని ఆరోపణ
- రెండు నెలల్లోగా అన్ని వసతులున్న భవనానికి తరలించాలని డిమాండ్
ఆంధ్రప్రభ, మహేశ్వరం: మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కొరతపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగళ్‌పల్లి వద్ద విద్యార్థులు నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాబోయే వైద్యుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. కళాశాలలో కనీస సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

26 నెలలుగా బిల్లులు చెల్లించలేదా?
మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, భవనం అద్దెను 26 నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. ఒక మెడికల్ కాలేజీ విద్యుత్, నీటి బిల్లులు చెల్లించడానికి నిధులు లేవా? అని ప్రశ్నించారు. విజన్ 2047, అమెరికా, చైనాతో పోటీ అంటూ మాట్లాడుతున్న ప్రభుత్వం.. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.

పాములు, పందులు, కుక్కల మధ్య విద్యార్థుల చదువులు!
కళాశాల పరిసరాల్లో పాములు, పందులు, కుక్కలు, కోతుల సంచారం ఉందని, ఈ సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్ సైతం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదనే కారణంతో సామాన్యుల ఇళ్లపై చర్యలు తీసుకునే ప్రభుత్వం.. ఓసీ, అగ్నిమాపక భద్రతా అనుమతులు లేని భవనంలో వైద్య కళాశాలను ఎలా నిర్వహిస్తోందని నిలదీశారు.
25 ఎకరాల స్థలం.. రూ.182 కోట్ల కేటాయింపు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహేశ్వరం మెడికల్ కాలేజీ కోసం కేసీఆర్ 25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.182 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా కళాశాల శాశ్వత భవన నిర్మాణం ముందుకు సాగలేదని విమర్శించారు. కళాశాల ఎక్కడ నిర్మించాలనే అంశంపై ఇంకా స్పష్టత లేదని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
విద్యార్థుల భద్రతపై ఆందోళన
కళాశాలలో మౌలిక వసతుల కొరతతో పాటు విద్యార్థుల భద్రత అంశం కూడా ఆందోళన కలిగిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు మూడు రోజులుగా రోడ్డుపై ధర్నా చేస్తుంటే ప్రభుత్వం, నిఘా విభాగం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేసే యంత్రాంగం.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు.
రెండు నెలల్లోగా తరలించాలి
మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, డీఎంఈ వెంటనే కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడాలని, వారి డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. రెండు నెలల్లోగా అన్ని మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు ఉన్న భవనానికి కళాశాలను తరలించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు వారి ఆందోళనకు అండగా ఉంటామని తెలిపారు.
కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల 2024 నవంబర్‌లో మంగళ్‌పల్లిలోని భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (బీఐఈటీ) తాత్కాలిక ప్రాంగణంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి శాశ్వత ప్రాంగణానికి తరలింపు, వసతి గృహాలు, రవాణా, భద్రత, బోధనా సదుపాయాలపై విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 150 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. గతంలోనూ తరగతులు, క్లినికల్ పోస్టింగ్‌లను బహిష్కరించి నిరసన తెలిపిన విద్యార్థులు.. అధికారుల నుంచి రాతపూర్వక హామీలు లభించలేదని ఆరోపిస్తున్నారు. కళాశాల తరలింపునకు స్పష్టమైన గడువు ప్రకటించడంతో పాటు హాస్టళ్లు, రవాణా, ఆసుపత్రి సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
