Harish Rao | రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్…
Harish Rao | రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్…
దేవాదులలో 10 మోటార్లు ఎందుకు నడపలేదు?
Harish Rao | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు, ప్రజల సమస్యలపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రజల పట్ల ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయని విమర్శించారు.
‘రేవంత్‌రెడ్డి ఏదైనా డబ్బులు పెట్టి కొనొచ్చు.. కానీ నీళ్లను కొనలేమని అంటున్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న నీటి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ప్రభుత్వమే కారణమని తాను మొదటి నుంచీ చెబుతున్నానని, అందుకు మీడియా సమావేశంలో ఉన్న జర్నలిస్టులే సాక్ష్యమని పేర్కొన్నారు.
దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు నడపాల్సి ఉండగా, కేవలం మూడు మోటార్లనే ఎందుకు నడిపించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రపంచమంతా అప్రమత్తమవుతున్న సమయంలో నీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ‘10కి 10 మోటార్లు నడిపి నీటిని ఎత్తిపోసి వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులను నింపాలని నేను పలుమార్లు కోరాను. వరంగల్ జిల్లాకు చెందిన మా నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దివంగత పెద్ద సుదర్శన్‌రెడ్డి సైతం ఈ అంశంపై పోరాడారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?’ అని నిలదీశారు.
‘మిస్టర్ రేవంత్‌రెడ్డి.. దేవాదులలో 10 మోటార్లను 24 గంటలపాటు నడిపించి ఉంటే ఈ రోజు వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడేవి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ ముందుచూపుతో సమ్మక్క బ్యారేజీని నిర్మించామని, కరువు సమయంలోనూ దేవాదుల ద్వారా ఏడాదిలో సుమారు 300 రోజులపాటు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ ద్వారా నీటిని వినియోగించుకుంటూ పంటలకు నీరందిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అక్కడ పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితి లేదని, పంటలు సాగవుతున్నాయని అన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం తక్కువగా నమోదైనా అక్కడ వ్యవసాయం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వర్షపాతం లోటు 12–13 శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి ప్రభుత్వ అసమర్థత, ముందస్తు ప్రణాళిక లోపమే కారణమని హరీశ్‌రావు విమర్శించారు.
