సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్‌..

గురుకులాల్లో యూనిఫాంలు, సాక్సులు, బెల్టులు కూడా లేవని మాజీ మంత్రి ఆరోపణ
సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఆశ్రమ గురుకుల పాఠశాల పరిస్థితులపై ఆవేదన.. తాగునీరు కూడా అందడం లేదంటూ విమర్శ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన ఆయన.. తెలంగాణ గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణలో విద్యను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అయితే, రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కనీస అవసరాలు తీరడం లేదని ఆరోపించారు. యూనిఫాంలు, సాక్సులు, బెల్టులు కూడా లేని పరిస్థితి నెలకొందని, కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని అన్నారు.

ప్రత్యేకంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని ఆశ్రమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హరీశ్‌రావు ప్రస్తావించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. అక్కడి విద్యార్థుల పరిస్థితి, వారు చెబుతున్న ఇబ్బందులు వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఒకవైపు ప్రపంచస్థాయి విద్య, ఆధునిక విద్యా విధానం అంటూ ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గురుకులాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. విద్యార్థులకు సురక్షితమైన భవనాలు, స్వచ్ఛమైన తాగునీరు, అవసరమైన దుస్తులు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని పేర్కొన్నారు.

‘ఇదేనా మీ ప్రపంచ స్థాయి విద్య?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గురుకులాల పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

https://twitter.com/BRSHarish/status/2095781778418249914/video/1