Harish Rao-BRS-Ktr PA,PRO | పండగపూట పోలీస్ స్టేషన్లో దాడికి యత్నం!
Harish Rao-BRS-Ktr PA,PRO | పండగపూట పోలీస్ స్టేషన్లో దాడికి యత్నం!
కేటీఆర్ పీఆర్వో, పీఏపై ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు : హరీశ్ రావు ఆరోపణ
Harish Rao-BRS-Ktr PA,PRO | హైదరాబాద్ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : పండగ రోజున విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. సోమవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీం ఈ విషయాన్ని గమనించి కేకలు వేస్తూ అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు.
ప్రభుత్వమే పోలీస్ స్టేషన్‌కు ముసుగులు ధరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను పంపించి దాడికి యత్నించడం అత్యంత దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లోనే దాడికి ప్రయత్నిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకు దాడులు చేస్తారా? అని నిలదీశారు.
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా దాడికి ప్రయత్నించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని హరీశ్ రావు ఆరోపించారు. హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టప్రకారం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లోనే దాడులు జరిగే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు అన్నారు.
