టీడీపీ గెలుపులో హరికృష్ణది కీలక పాత్ర
ఎన్టీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న హరికృష్ణ
చైతన్య రథసారథిగా చరిత్రలో చెరగని ముద్ర
ఉమ్మడి కృష్ణాజిల్లాతో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం
పాడి పరిశ్రమ, పశువులంటే ఆయనకు అపారమైన మమకారం
పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సంబంధాలు
టీడీపీ ఆవిర్భావం నుంచి హరికృష్ణ సేవలు చిరస్మరణీయం
ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ గెలుపులో, పార్టీ బలోపేతంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ కీలక పాత్ర పోషించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. హరికృష్ణ జయంతి సందర్భంగా విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్యతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని, పార్టీకి ఆయన అందించిన సేవలను ఎంపీ చిన్ని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావును హరికృష్ణ నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకునేవారని ఎంపీ చిన్ని అన్నారు. సుదీర్ఘకాలం తండ్రి వెన్నంటే ఉండి ఆయనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో చైతన్య రథసారథిగా హరికృష్ణ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
కృష్ణాజిల్లాతో ప్రత్యేక అనుబంధం..
ఉమ్మడి కృష్ణాజిల్లాపై హరికృష్ణకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేదని ఎంపీ చిన్ని తెలిపారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులతో ఎల్లప్పుడూ ఆత్మీయ సంబంధ బాంధవ్యాలు కొనసాగించేవారని చెప్పారు. హరికృష్ణకు పాడి పరిశ్రమపై అపారమైన ప్రీతి ఉండేదని చిన్ని పేర్కొన్నారు. పశువులపై కూడా ఆయనకు ఎంతో మమకారం ఉండేదని గుర్తుచేశారు. మంత్రి నారా లోకేష్‌కు కార్లంటే ఉన్న అభిమానం తన హరి మామయ్య హరికృష్ణ దగ్గర నుంచే వచ్చిందని ఆయన ఎల్లప్పుడూ చెబుతుంటారని చిన్ని తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతోనూ ఎంతో ఆత్మీయంగా మెలిగేవారని పేర్కొన్నారు.యుడతెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని ఎంపీ చిన్ని అన్నారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, ఎన్టీఆర్‌కు అందించిన సహకారం, నాయకులు–కార్యకర్తలతో కొనసాగించిన అనుబంధం టీడీపీ శ్రేణులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
