రోడ్డుపైనే పార్కింగ్.. చర్యలేవీ !?
- వైన్స్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం.. ప్రమాదాల ముప్పు
హనుమకొండ, ఆంధ్రప్రభ : నగరంలోని డబ్బాల ప్రాంతంలో ఉన్న రంజిత్ వైన్స్ వద్ద పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. ప్రతిరోజూ సాయంత్రం వేళ వైన్స్ సమీపంలో వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా నిలిపివేస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి పెద్దమ్మగడ్డ వైపు వెళ్లే వాహనదారులు వైన్స్ సమీపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. రోడ్డుపై వాహనాల నిలుపుదలతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను నిలిపే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైన్స్, బార్ల వద్దకు వచ్చే వినియోగదారుల వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే ఇలాంటి వ్యాపార సంస్థలను రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.
