జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
ఓటర్ల జాబితాలో అక్రమాలపై నైతిక బాధ్యత వహించాలి: రఘువీరారెడ్డి
పుట్టపర్తిలో కాంగ్రెస్ ఆందోళన.. సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో బుధవారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ కూడలిలో జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశామని, ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై సీఈసీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవనోపాధి కోసం ఓటర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం సహజమని, అంతమాత్రాన వారి ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత అత్యంత కీలకమని, ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది కాంగ్రెస్ నేతల రాజకీయ ఆరోపణ. ఎన్నికల సంఘం మాత్రం తన చర్యలు చట్టబద్ధమైనవేనని పేర్కొంటోంది.
దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించి అర్హులైన వారి పేర్లను కాపాడాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించే వరకు కాంగ్రెస్ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
