Gyanesh Kumar | జ్ఞానేశ్‌ కుమార్‌కు 42 మంది మాజీ జడ్జీల మద్దతు

  • ‘రాజకీయ ప్రయోజనాలతోనే ప్రచారం’ అంటూ బహిరంగ లేఖ
  • ఈసీని ప్రశ్నించొచ్చు.. కానీ వ్యక్తిగతంగా కించపరచడం సరికాదని వ్యాఖ్య
  • ఆరోపణలకు ఆధారాలు చూపాలని సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 42 మంది మాజీ న్యాయమూర్తులు జ్ఞానేశ్‌ కుమార్‌కు మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈసీ, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రజాస్వామ్యంలో సహజమేనని.. అయితే వ్యక్తిగతంగా దూషించడం, కించపరిచే పదజాలం ఉపయోగించడం మాత్రం సరికాదని స్పష్టం చేశారు.

‘విమర్శించండి.. కానీ హద్దు దాటొద్దు’

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను ‘కీలుబొమ్మ’, ‘దొంగ’, ‘రాజీ పడిన అధికారి’ వంటి పదాలతో సంబోధించడంపై మాజీ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన అధికారులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వల్ల సంస్థలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ ఆ విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారకూడదు అని వారు అభిప్రాయపడ్డారు. అధికార మార్పిడి జరిగితే ప్రతీకారం తప్పదన్న రీతిలో ఎన్నికల అధికారులను హెచ్చరించడం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైన పరిణామం కాదని పేర్కొన్నారు.

‘ఆరోపణలు చేస్తున్నారు.. ఆధారాలేవి?’

ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేస్తున్న కార్యకర్తలు, పౌరసంఘాల వైఖరిపైనా మాజీ జడ్జీలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నప్పటికీ.. వాటిని బలపరిచే ఆధారాలను తగిన స్థాయిలో సమర్పించడం లేదని తమ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు, పౌరసంఘాలు మాత్రం తమ వాదనలను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష వర్గాల వాదనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి.

కాంగ్రెస్‌ విమర్శలపైనా స్పందన

ఈసీపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను కూడా మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో ప్రస్తావించారు. ఒకప్పుడు ఇదే ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో విజయాలు సాధించిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అదే వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయడంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం కోరిన ప్రమాణపత్రాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సమర్పించలేదని కూడా వారు పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ వైఖరి, ఈసీ స్పందన మధ్య ఇప్పటికే రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

మరోవైపు.. రాహుల్‌ గాంధీ ఆరోపణలు

మాజీ న్యాయమూర్తుల లేఖ వెలువడిన సమయంలోనే ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాహుల్‌ గాంధీ ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ‘కుట్ర’ ద్వారా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ ఖండించాయి.

సర్‌పై ఎవరి వాదన వారిదే..

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపైనా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు సవరణలు అవసరమని మాజీ న్యాయమూర్తులు పేర్కొంటుండగా.. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సర్‌ ఇప్పుడు కేవలం ఓటర్ల జాబితా సవరణ అంశంగా కాకుండా.. ఎన్నికల వ్యవస్థపై జరుగుతున్న విస్తృత రాజకీయ చర్చలో కీలక అంశంగా మారింది.

మద్దతు ఒకవైపు.. ఆరోపణలు మరోవైపు

జ్ఞానేశ్‌ కుమార్‌ చుట్టూ కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ప్రధానంగా రాజకీయ పార్టీల మధ్య సాగిన విమర్శలు, ఆరోపణలు.. తాజాగా మాజీ న్యాయమూర్తుల బహిరంగ లేఖతో న్యాయ, రాజ్యాంగ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ఒకవైపు ఈసీపై ప్రతిపక్షాల ఆరోపణలు.. మరోవైపు సీఈసీకి మాజీ న్యాయమూర్తుల మద్దతు. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఎన్నికల సంఘం విశ్వసనీయతపై సాగుతున్న ఈ చర్చ రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశముంది.