క్రాకర్స్ విక్రయాలకు జీఎంసీ అనుమతి తప్పనిసరి
సింగిల్ విండోలో దరఖాస్తు చేసుకోవాలి..
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, ఆంధ్రప్రభ: దీపావళి నేపథ్యంలో నగరంలో బాణాసంచా విక్రయ దుకాణాల ఏర్పాటుకు గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నుంచి సింగిల్ విండో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గురువారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాపారులు సింగిల్ విండో కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం, ట్రాఫిక్ పోలీసుల అనుమతి, జీఎస్టీ చెల్లింపు రశీదు, స్థల యజమాని అంగీకార పత్రం, రెవెన్యూ అనుమతి పత్రాలను జత చేయాలన్నారు. అధికారులు పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. నిర్దేశించిన ప్రదేశాల్లోనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయాలని, నివాస ప్రాంతాల్లో అనధికారికంగా విక్రయాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ప్రతి దుకాణం వద్ద నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలుదారుల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ డి.రాంబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఏడీఎఫ్‌ఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
