Gundrampalli Telangana | రజాకార్ల దాష్టీకానికి తల్లడిల్లిన పల్లె.. నేటికీ చెక్కుచెదరని నాటి జ్ఞాపకాలు
● నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి కేంద్రం
● బావిలో వందలాది మృతదేహాలు.. గుర్తించిన 26 మంది పేర్లు
● నేటికీ అమరవీరుల త్యాగాలకు సాక్ష్యంగా స్మారక స్థూపం
చిట్యాల, ఆంధ్రప్రభ: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగింది. నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దాష్టీకాలు, భూస్వామ్య పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటంలో గుండ్రాంపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. రజాకార్ల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాదానికి ఈ గ్రామం సాక్ష్యంగా నిలిచింది. ఆ నెత్తుటి చరిత్రకు గుర్తుగా నిలిచిన మృతవీరుల స్మారక స్థూపం నేటికీ నాటి పోరాట స్ఫూర్తిని చాటుతోంది. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం.
రజాకార్ల దౌర్జన్యాలకు కేంద్రంగా..
హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు నిజాం నిరాకరించిన సమయంలో ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్ వ్యవస్థ బలపడింది. తొలుత నిజాం ప్రభుత్వానికి అండగా నిలిచే స్వచ్ఛంద కార్యకర్తలుగా ఏర్పడిన వీరు అనంతరం ఆయుధాలు చేతబట్టి ప్రజలపై దాడులు, దోపిడీలు, పన్నుల వసూళ్లు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. దీంతో ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పూనుకున్నారు.
మక్బూల్ అరాచకాలతో గుండ్రాంపల్లి గడగడ
సూర్యాపేట తాలూకాలోని వర్ధమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ (సైదీమోల్) గుండ్రాంపల్లిలోని తన అక్క ఇంటికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడని గ్రామస్థులు చెబుతున్నారు. నిజాం సైన్యంలో పనిచేసిన మక్బూల్ అనంతరం రజాకార్లతో కలిసి గ్రామంలో ఆధిపత్యం చెలాయించాడని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా ఉన్న భవనం అప్పట్లో మక్బూల్ నివాసంగా ఉండేదని చెబుతున్నారు. మక్బూల్ అరాచకాలను ఎదుర్కొనేందుకు గుండ్రాంపల్లి కేంద్రంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆత్మరక్షణ దళాలు ఏర్పడ్డాయి. గుండ్రాంపల్లి, ఏపూరు, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, పంతంగి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె తదితర గ్రామాల యువకులు దళాలుగా ఏర్పడి రజాకార్లను ఎదుర్కొన్నారు.
వందలాది మంది బలి.. 26 పేర్లే గుర్తింపు
సాయుధ పోరాట దళాలు మక్బూల్‌పై పలుమార్లు దాడులు చేశాయి. 1948 జూన్ 19న మునుగోడు మండలం పలివెలకు చెందిన కమాండర్ కొండవీటి గురున్నాథరెడ్డి తదితరులు మక్బూల్ ఇంటిపై దాడి చేసినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. అనంతరం జరిగిన మరో దాడిలో మక్బూల్ గాయపడి తప్పించుకోగా, అతని భార్య మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ప్రతీకారంతో మక్బూల్ మరింత దారుణాలకు పాల్పడ్డాడని స్థానికుల కథనం. గుండ్రాంపల్లి పరిసర గ్రామాలకు చెందిన యువకులు, రైతులను బంధించి హతమార్చి, మృతదేహాలను ఏపూరు వెళ్లే మార్గంలోని బావిలో పడేశారని చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వందలాది మందిలో 26 మందిని మాత్రమే గుర్తించి వారి పేర్లను స్మారక స్థూపం శిలాఫలకంపై లిఖించారు.

స్థూపం.. మూడు దశల్లో నిర్మాణం
అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తొలిసారిగా 1985లో సీపీఐ గ్రామశాఖ ఆధ్వర్యంలో స్మారక స్థూపాన్ని నిర్మించారు. అది చిన్నగా ఉండటంతో 1993 జూన్ 4న మరోసారి నిర్మించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆ స్థూపాన్ని తొలగించాల్సి రావడంతో ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో 2016 జూన్ 11న నూతన స్థూపాన్ని నిర్మించారు. దివంగత సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 17 సందర్భంగా ఇక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు.

విముక్తి.. మారిన గ్రామ ముఖచిత్రం
1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో నిజాం పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు తెరపడింది. గుండ్రాంపల్లి కూడా ఊపిరి పీల్చుకుంది. నేడు నాలుగు వేలకుపైగా జనాభాతో గ్రామం అభివృద్ధి చెందుతోంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, పీఏసీఎస్, తెలంగాణ వికాస్ బ్యాంకు వంటి సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి-65, హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది.
తెలంగాణ ఉద్యమంలోనూ..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ గుండ్రాంపల్లి ప్రజలు కీలక పాత్ర పోషించారు. ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యమంలో పాల్గొన్నారు. 2017లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గుండ్రాంపల్లిని సందర్శించి అమరుల కుటుంబాలను పరామర్శించారు. గ్రామ చరిత్ర ఇటీవల ‘రజాకార్’ చిత్రంలోనూ ప్రస్తావనకు వచ్చింది.
విమోచన దినోత్సవంపై భిన్నాభిప్రాయాలు
సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ బీజేపీ చాలాకాలంగా చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. అయితే గుండ్రాంపల్లిలో మాత్రం నాటి పోరాట యోధులను స్మరించుకోవడం ప్రతి ఏడాది కొనసాగుతోంది.
చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి: గరిషె శేఖర్ (చిట్టిబాబు), గుండ్రాంపల్లి
రజాకార్లకు, నిజాం నవాబు ఆగడాలకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి ప్రజలు చేసిన పోరాటానికి ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వాలి. ఈ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు తెలియజేయాలి. గ్రామంలో స్మృతివనం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని గుండ్రాంపల్లిలో అధికారికంగా నిర్వహించాలి.
నమస్తే పెట్టలేదని కొట్టాడు: నమ్ముల బుచ్చయ్య గౌడ్, గుండ్రాంపల్లి
నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మక్బూల్ ఎదురయ్యాడు. తనకు నమస్తే పెట్టలేదని చెంపపై కొట్టాడు. మక్బూల్ గ్రామంలో అనేక అరాచకాలు చేశాడు. అతనికి భయపడి చాలామంది గ్రామాన్ని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారు. భారత ప్రభుత్వ మిలటరీ వస్తుందన్న సమాచారం తెలియడంతో మక్బూల్ గ్రామం నుంచి పారిపోయాడు. నిజాం పాలన ముగిసిన తర్వాత ప్రశాంతంగా జీవిస్తున్నాం.
స్థూపం నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది: మిద్దెల మల్లేశం గౌడ్, మాజీ సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా.. నాటి అమరవీరుల జ్ఞాపకార్థం 1985లో స్మారక స్థూపం నిర్మించడంలో భాగస్వామ్యం కావడం మర్చిపోలేని అనుభూతి. చెరుకు ఉషాగౌడ్, నమ్ముల యాదగిరి, కన్నయ్య రాములు, బొడిగె బుచ్చయ్య, మిద్దెల అంజయ్య, గోపగోని సత్తయ్య, పంతంగి శంకర్, నమ్ముల రాములుతో పాటు పలువురి సహకారంతో స్థూపం నిర్మించాం. నాటి పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి.
అమరవీరుల త్యాగాలను భావితరాలకు అందించాలి: బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహగౌడ్, సర్పంచ్, గుండ్రాంపల్లి
గుండ్రాంపల్లికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. నాటి అమరవీరుల త్యాగాలను భావితరాలకు అందించేందుకు స్మారక స్థూపాన్ని మరింత అభివృద్ధి చేయాలి. గ్రామ చరిత్రను తెలిపేలా స్మృతివనం ఏర్పాటు చేయాలి. ప్రతి సెప్టెంబరు 17న అమరవీరులను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలి.


