నగరం నిద్రలేవక ముందే సేవలు..

కార్మికులకు దక్కని భద్రత

గత 8 నెలలుగా అందని గ్లౌస్‌లు, చీపుర్లు, సబ్బులు.. గుండ్లపోచంపల్లిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

మేడ్చల్, ఆంధ్రప్రభ : నగరం కన్నుతెరిచే లోపే వీధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బుధవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. ధర్నా చేస్తున్న కార్మికులకు మేడ్చల్‌ జిల్లా భాజపా నాయకుడు అమరం మోహన్‌రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా రోడ్లు ఊడ్చేందుకు చీపుర్లు, మురుగు ఎత్తిపోసేందుకు చేతి గ్లౌస్‌లు, సబ్బులు, నూనె, బెల్లం వంటి కనీస సదుపాయాలను అధికారులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రక్షణ పరికరాలు లేకుండానే విధులు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు.

మున్సిపాలిటీని సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసినప్పటికీ వేతనాలు మాత్రం పాత మున్సిపల్‌ స్కేల్‌ ప్రకారమే చెల్లిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. అంతేకాకుండా, అరకొరగా అందుతున్న వేతనాల్లోనూ పన్నుల పేరుతో నెలకు రూ.500 వరకు కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు అవసరమైన రక్షణ పరికరాలు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.