Guinness World Records | 60 ఏళ్ల వ్యక్తి అరుదైన గిన్నిస్ రికార్డ్!
- రోజుకు సగటున 3.3 చిత్రాలు
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: ఓ వ్యక్తి 12 నెలల్లో 1,207 సినిమాలు.. ఒకే థియేటర్ లో చూశాడంటే నమ్మగలరా..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సినిమాలంటే ప్రాణమిచ్చే ఓ వ్యక్తి తన అభిరుచినే ప్రపంచ రికార్డుగా మార్చుకున్నాడు. ఏడాది పాటు దాదాపు ప్రతిరోజూ సినిమా థియేటర్‌కు వెళ్లి, ఏకంగా 1,207 సినిమాలు చూశాడు.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం యార్క్ హేవన్‌కు చెందిన 60 ఏళ్ల గ్లెన్‌వుడ్ హోస్కిన్ జూనియర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. తనకు దగ్గర్లోని రీగల్ సినిమా థియేటర్‌లో 12 నెలల పాటు సినిమాలు చూస్తూ ఈ రికార్డును సృష్టించాడు. రోజుకు సగటున 3.3 సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. గతంలో ఈ రికార్డు ఏడాదిలో 777 సినిమాలు చూసిన వ్యక్తి పేరిట ఉంది.
అయితే గ్లెన్‌వుడ్ సినిమాల షెడ్యూల్‌ను ముందుగానే పరిశీలించి, రోజంతా వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చూసేలా ప్లాన్ సిద్ధం చేసుకునేవాడట. ఇంటి నుంచి బయటకు వచ్చి కొత్త అనుభవాలను పొందడం తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నా గ్లెన్‌వుడ్ . క్రమశిక్షణతో చేసిన ప్రయత్నమే ఈ రికార్డుకు కారణమని పేర్కొన్నాడు.
మొదట ఒకే సినిమాను ఎక్కువ సార్లు చూడటం, ఏడాదిలో ఎక్కువ సినిమాలను థియేటర్‌లో చూడటం వంటి గిన్నిస్ రికార్డుల గురించి ఆన్‌లైన్‌లో పరిశీలించిన గ్లెన్‌వుడ్. ఒకే సినిమాను ఎక్కువ సార్లు చూసిన రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవడంతో, ఏడాదిలో ఎక్కువ చిత్రాలు చూసే రికార్డుపై దృష్టి పెట్టాడు.
పాత రికార్డు బద్దలు..
ఇంతకుముందు ఒక ఏడాదిలో ఒకే సినిమా థియేటర్‌లో 777 చిత్రాలు చూసిన జకారియా స్వోప్ పేరిట ఈ రికార్డు ఉండేది. గ్లెన్‌వుడ్ మాత్రం ఏకంగా 1,207 సినిమాలు చూసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. గ్లెన్‌వుడ్‌కు కార్టూన్ సినిమాలు, కామెడీ చిత్రాలంటే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ప్రేక్షకులతో కలిసి కామెడీ సినిమాలు చూస్తూ నవ్వుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు. ‘ది వైల్డ్ రోబోట్’, ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. ఈ రికార్డు సృష్టించే ప్రయాణంలో థియేటర్ సిబ్బంది కూడా అతనికి సహకరించారు. ఏ సినిమాలు తక్కువ రన్ టైం ఉన్నాయో తెలియజేస్తూ, రోజువారీ షెడ్యూల్ తయారుచేసి ఇచ్చేవారు.
నెలకు రూ.2,500తో..
ఇన్ని సినిమాలు చూడటానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? కానీ గ్లెన్‌వుడ్ వద్ద రీగల్ అన్‌లిమిటెడ్ కార్డు ఉంది. దీనికి నెలకు సుమారు 28 డాలర్లు చెల్లించి అపరిమితంగా సినిమాలు చూసేవాడు. ఖర్చు తగ్గించుకునేందుకు ఇంటి నుంచే ఆహారం తీసుకెళ్లేవాడు. సినిమాల మధ్య విరామంలో థియేటర్ పరిసరాల్లో నడుస్తూ రోజువారీ వ్యాయామం కూడా చేసుకునేవాడు. సినిమా చూడటమంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది తనకు ఒక సవాలు, ఒక లక్ష్యమని గ్లెన్‌వుడ్ చెబుతున్నాడు. అభిరుచికి పట్టుదల, ప్రణాళిక తోడైతే అసాధ్యమనుకున్న లక్ష్యాలనూ సాధించవచ్చని ఈ సినీ ప్రియుడి రికార్డు నిరూపిస్తోంది.
