గుడివాడ మున్సిపల్‌ ఎన్నికలకు మార్గం సుగమం

మున్సిపాలిటీపై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. మున్సిపాలిటీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. గుడివాడ మున్సిపాలిటీలో సమీప గ్రామాలను విలీనం చేయాలని 2021లో ప్రతిపాదించారు. గుడివాడ రూరల్‌ మండలంలోని లింగవరం, వలివర్తిపాడు, మల్లయ్యపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనిని సవాల్‌ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో గతంలో ఎన్నికలు జరగలేదు.

సమీప గ్రామాల విలీనానికి సంబంధించిన సవరణ చట్టాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టే అవకాశం ఏర్పడింది. కొత్తగా ఏర్పడే వార్డులు, డివిజన్ల పునర్విభజనలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో వార్డుల విభజనపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. గుడివాడ మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా తయారీ, వార్డుల పునర్విభజన, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉంది. రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.