గుడివాడలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి

రూ.1.75 కోట్లతో రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గుడివాడ, ఆంధ్రప్రభ : పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణంలోని 20, 23వ వార్డుల్లో చేపట్టనున్న రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు సోమవారం స్థానికులతో కలిసి ఎమ్మెల్యే రాము భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. 20వ వార్డులోని బ్యాంక్‌ కాలనీలో రూ.60 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఆర్టీసీ కాలనీలో రూ.70 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు, సత్యనారాయణపురంలో రూ.45 లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ అభివృద్ధి ఒక రోజుతోనో, ఒక కార్యక్రమంతోనో పూర్తయ్యేది కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కొనసాగించే ప్రక్రియ అని స్పష్టం చేశారు. పట్టణంలో దీర్ఘకాలంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రజలకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని, ముఖ్యంగా తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు కాలనీలు, శివారు ప్రాంతాల్లోనూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.