GST Council reforms 2026 | జీఎస్టీ నిబంధనలు మరింత సరళం!..
GST Council reforms 2026 | జీఎస్టీ నిబంధనలు మరింత సరళం!..
- సంస్కరణలకు కేంద్రం అడుగులు
- 17 రోజుల్లోనే రిఫండ్లు!
- సులభతర రిజిస్ట్రేషన్.. వేగంగా రిటర్నుల ప్రక్రియ
- ఐటీసీ నిబంధనల్లో మార్పులు.. వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ ఊరట
- జీఎస్టీ నేరాల డీక్రిమినలైజేషన్పై చర్చ.. జీసీసీలకు ఎగుమతి హోదాపై ప్రతిపాదన
- 8న న్యూఢిల్లీలో జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
GST Council reforms 2026 | ఆంధ్రప్రభ, బిజినెస్ ప్రతినిధి: వ్యాపారాలకు జీఎస్టీ నిబంధనలను మరింత సరళతరం చేయడంతో పాటు పన్ను చెల్లింపు ప్రక్రియలో జాప్యాలను తగ్గించే దిశగా కేంద్రం మరో విడత సంస్కరణలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, రిఫండ్లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), పన్ను వివాదాలు, జీఎస్టీ నేరాల స్వరూపం వంటి అంశాలపై కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయని సమాచారం. ముఖ్యంగా వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ వేగంగా అందుబాటులోకి వచ్చేలా రిఫండ్ వ్యవస్థను మార్చడం, ఐటీసీకి సంబంధించిన పరిమితులను సమీక్షించడం, చిన్న సంస్థలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
17 రోజుల్లో రిఫండ్!
వ్యాపారాలకు అత్యంత కీలకమైన రిఫండ్ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించే ప్రతిపాదన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. రిఫండ్ దరఖాస్తును పది రోజుల్లోగా స్వీకరించి, రిస్క్ పరిశీలన అనంతరం క్లెయిమ్‌లోని 90 శాతం మొత్తాన్ని ముందుగానే విడుదల చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని దరఖాస్తు అంగీకరించిన ఏడు రోజుల్లో చెల్లించేలా నిబంధనలను మార్చే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే రిఫండ్ ప్రక్రియ మొత్తం 17 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రిఫండ్ దరఖాస్తుల అంగీకారానికే సుమారు 21 నుంచి 45 రోజుల సమయం పడుతున్న నేపథ్యంలో ప్రతిపాదిత మార్పులు అమల్లోకి వస్తే సంస్థలకు నిలిచిపోయిన నగదు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రిఫండ్ క్లెయిమ్‌లను రిస్క్ ఆధారంగా పరిశీలించే విధానాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుడి గత రికార్డులు, రిటర్నులు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించి తక్కువ రిస్క్ ఉన్న క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించనున్నారు.
మూడు రోజుల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్..
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయడంపైనా కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రస్తుతం 61 శాతం మంది పన్ను చెల్లింపుదారులకు మూడు పని దినాల్లోనే అధికారి జోక్యం లేకుండా రిజిస్ట్రేషన్ మంజూరవుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మిగిలిన దరఖాస్తుల్లో అనవసర ప్రశ్నలు, తిరస్కరణలకు అవకాశం లేకుండా ప్రక్రియను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఒకే దరఖాస్తుతో ప్రక్రియను పూర్తి చేయడం, అవసరమైన పత్రాలపై స్పష్టమైన జాబితా, ఇప్పటికే ఉన్న జీఎస్టీ గుర్తింపు సంఖ్య (GSTIN) వివరాలను కొత్త దరఖాస్తులో వినియోగించుకోవడం, పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో దరఖాస్తు చేసుకునే అవకాశం, అధికార పరిధిని ఆటోమేటిక్‌గా కేటాయించడం వంటి మార్పులపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.
రిటర్నుల దాఖలాలోనూ మార్పులు
రిటర్నుల దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు ఇన్వాయిస్‌ల సరిపోలిక, ఐటీసీ ధ్రువీకరణను రికార్డు చేసే సమయంలోనే పూర్తి చేసే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనివల్ల ఇన్వాయిస్‌ల మధ్య వ్యత్యాసాల కారణంగా జారీ అయ్యే నోటీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం సరైన ఇన్వాయిస్ ఉన్నప్పటికీ సరఫరాదారు పన్నును ప్రభుత్వానికి జమ చేయకపోతే కొనుగోలుదారుడు ఐటీసీ కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఐటీసీ నిబంధనల్లో మార్పులు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
ఐటీసీపై కీలక సమీక్ష
వ్యాపారాల వర్కింగ్ క్యాపిటల్‌పై ప్రభావం చూపుతున్న నిలిచిపోయిన ఐటీసీ నిబంధనలను సమీక్షించే ప్రతిపాదన కూడా ఉంది. కొన్ని సేవలు, ప్లాంట్, యంత్రసామగ్రిపై చెల్లించిన పన్నుకు ఐటీసీ కల్పించే అంశాన్ని పరిశీలించనున్నారు.
అదేవిధంగా ఔట్‌డోర్ క్యాటరింగ్, ఆరోగ్య, జీవిత బీమా, టెలికాం టవర్లు, ఫ్యాక్టరీ పరిధికి వెలుపల ఏర్పాటు చేసే పైప్‌లైన్లు, ఉచిత నమూనాలు, చట్ట ప్రకారం గడువు ముగిసిన వస్తువుల ధ్వంసం, 13 మంది వరకు సీటింగ్ సామర్థ్యం ఉన్న వాహనాలు, వాటి బీమా, సర్వీసింగ్, నిర్వహణతో పాటు వాహనాల లీజింగ్, అద్దెకు తీసుకునే సేవలపై ఉన్న ఐటీసీ పరిమితులను కూడా సమీక్షించే అవకాశం ఉంది.
2025లో కాంపెన్సేషన్ సెస్ నిలిపివేసిన తర్వాత ఆటోమొబైల్ డీలర్ల ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లలో నిలిచిపోయిన సుమారు రూ.2,500 కోట్ల ఇన్‌పుట్ సెస్ క్రెడిట్‌కు పరిష్కారం చూపాలన్న డిమాండ్ కూడా పరిశ్రమ వర్గాల నుంచి వస్తోంది.
జీసీసీలకు ఎగుమతి హోదా?
భారత్‌లో పనిచేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు సంబంధించిన పన్ను అంశంపైనా కీలక ప్రతిపాదన పరిశీలనలో ఉంది. విదేశీ సంస్థలకు చెందిన భారతీయ కేంద్రాలు ఇంజినీరింగ్, ఉత్పత్తి అభివృద్ధి, టెస్టింగ్ వంటి సేవలను అందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విదేశీ గ్రూప్ కంపెనీల నుంచి భారత్‌లోని జీసీసీలకు వస్తువులు వచ్చినప్పుడు వాటిపై నిర్వహించే సేవలకు ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీయ సరఫరాగా పరిగణించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో విదేశీ సంస్థకు సేవలు అందించినప్పటికీ జీఎస్టీ భారం పడుతోంది. ప్రతిపాదిత మార్పులు అమల్లోకి వస్తే అర్హత కలిగిన సేవలకు ఎగుమతి హోదా లభించే అవకాశం ఉంది. తద్వారా జీఎస్టీ భారం తగ్గడంతో పాటు ఇన్‌పుట్‌లపై చెల్లించిన పన్నుకు రిఫండ్ పొందే అవకాశం ఏర్పడవచ్చు.
జీఎస్టీ రద్దు మరింత సులభం
వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను కూడా సులభతరం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. పన్ను బకాయిలన్నీ చెల్లించి, రిటర్నులు పూర్తిగా దాఖలు చేసిన వ్యాపారాలకు భౌతిక తనిఖీ అవసరాన్ని తొలగించే అంశాన్ని పరిశీలించనున్నారు.
పన్ను వివాదాలకు చెక్!
జీఎస్టీకి సంబంధించిన వివాదాలు, వ్యాజ్యాలను తగ్గించేందుకు నోటీసులు, విచారణలు, వ్యక్తిగత వాదనలు, ఉత్తర్వులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలను తీసుకురావాలని భావిస్తున్నారు. నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ మొత్తాలకు నోటీసులు జారీ చేయకుండా పరిమితి విధించే ప్రతిపాదన ఉంది. రూ.10 వేల కంటే తక్కువ పన్ను డిమాండ్లకు నోటీసులు ఇవ్వకూడదన్న సూచన కూడా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చింది.
పెండింగ్‌లో ఉన్న విచారణలు, అప్పీళ్లకు కూడా ఇలాంటి విధానం వర్తింపజేయాలని పరిశ్రమ కోరుతోంది. దీనివల్ల చిన్న మొత్తాల పన్ను వివాదాలపై అధికారులు, వ్యాపారులు వెచ్చించే సమయం తగ్గే అవకాశం ఉంది.
అరెస్టు నిబంధనపై చర్చ
జీఎస్టీ చట్టంలోని కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి తొలగించే అంశం కూడా కౌన్సిల్ పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పన్ను అధికారులకు ఉన్న అరెస్టు అధికారాలపై మార్పుల ప్రతిపాదన చర్చకు రానుంది. ప్రస్తుతం సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్దిష్ట తీవ్రమైన నేరాల విషయంలో కమిషనర్ అనుమతితో అరెస్టు చేసే అధికారం ఉంది. నకిలీ ఇన్వాయిస్‌లు, మోసపూరిత ఐటీసీ, తప్పుడు రిఫండ్ క్లెయిమ్‌లు, ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత వంటి కేసులు ఇందులోకి వస్తాయి. ఈ నిబంధనలో మార్పులు చేసి, కొన్ని పన్ను వివాదాలను అరెస్టు వంటి క్రిమినల్ చర్యలకు బదులుగా పన్ను, వడ్డీ, జరిమానా వసూలు వంటి సివిల్ చర్యల ద్వారా పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పన్ను రేట్లలో మార్పులు లేనట్టే..
అక్టోబర్ 8న జరిగే సమావేశంలో విస్తృత స్థాయిలో జీఎస్టీ పన్ను రేట్లను మార్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో రేట్ల సవరణలను ఏడాదికి ఒకసారి మాత్రమే చేపట్టి, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి అమలు చేసే విధానంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 2027 నుంచి అమలయ్యే అవకాశం
కౌన్సిల్ ఆమోదం పొందిన ప్రతిపాదనలన్నింటినీ ఒకేసారి అమలు చేయకుండా దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది. ప్రతిపాదిత సంస్కరణల్లో ఎక్కువ భాగం 2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్ల కంటే జీఎస్టీ ప్రక్రియల సరళీకరణ, వేగవంతమైన రిఫండ్లు, ఐటీసీ సౌలభ్యం, జీసీసీలకు పన్ను స్పష్టత, చిన్న వ్యాపారాలకు అనుకూల నిబంధనలు, వివాదాల తగ్గింపు, కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందితే పన్ను చెల్లింపుదారులపై అనుసరణ భారాన్ని తగ్గించడంతో పాటు వ్యాపారాల్లో నిలిచిపోయే మూలధనం వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
