‘సంఘ్ పరివార్’తో దూరం.. దూరం..
- బెడిసి కొడుతున్న బీజేపీ రాజకీయ వ్యూహం!
- ప్రశ్నార్థకంగా మారుతున్న సంస్థాగత బలోపేతం
- అనుబంధ సంస్థల మద్ధతూ అంతంత మాత్రమే
- నేతల మధ్య సమన్వయ లోపంతో అంతర్గతంగా పెరుగుతున్న సమస్యలు
- ఆర్ఎస్ఎస్ దూతలను రంగంలోకి దింపాలన్న అధిష్టానం వ్యూహానికి దెబ్బ
- ఏ జిల్లాలో చూసినా.. గ్రామస్థాయి వరకూ వెళ్లలేకపోతున్న కాశాయ దళం
- ‘పరిషత్’, ‘గ్రేటర్’ ఎన్నికల్లో ధీటైన పోటీ ఇస్తామన్న నేతలంతా డీలా
- కార్యకర్తల మనోభీష్టం మేరకు బీజేపీలో రాజకీయ కార్యాచరణ కరువు
- నేతల మధ్య అంతర్గత విభేదాలు, పార్టీ నిర్ణయాల్లో అభిప్రాయ భేదాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : నాడు ఆ పార్టీ, నేడు ఈ పార్టీ.. అధికార, ప్రతిపక్షాలు రెండూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నాయన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజల మద్ధతు పొందే అవకాశమున్న తెలంగాణ బీజేపీలో రాజకీయ ముసలం ముంచేస్తోంది. ”మద్ధతిస్తాం.. అధికారాన్ని దక్కించుకుందాం” అన్న ‘సంఘ్ పరివార్’ నేతల ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏకీభవించని కారణంగా వారి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భిన్నంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మద్దతు కూడగట్టుకోవాలన్న తపన ఏ ఒక్క నేతలోనూ కనిపించడం లేదు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నా, ఇటు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కుల రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని ఆర్టీకి చెందిన నేతలే ధృవీకరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అభిప్రాయ భేదాలతో నేతల మధ్య పెరుగుతున్న అంతరమేనని స్పష్టమవుతోంది. దీంతో బీజేపీ రాజకీయ వ్యూహం బెడిసి కొడుతున్నట్లు సంస్థాగతంలో దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల క్రమంలో సంస్థాగత బలోపేతం ప్రశ్నార్థకంగా మారుతోంది. అనుబంధ సంస్థల మద్ధతూ అంతంత మాత్రమేన్న భావన పెరుగుతోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆర్ఎస్ఎస్ దూతలను రంగంలోకి దింపాలన్న అధిష్టానం వ్యూహానికి కూడా దెబ్బ తలుగుతోంది. ఏ జిల్లాలో చూసినా.. కాశాయ దళం గ్రామస్థాయి వరకూ వెళ్లలేకపోతోంది. త్వరలో జరగనున్న ‘పరిషత్’, ‘గ్రేటర్’ ఎన్నికల్లో ధీటైన పోటీ ఇస్తామన్న నేతలంతా డీలా పడిపోతున్నారు. కార్యకర్తల మనోభీష్టం మేరకు బీజేపీలో రాజకీయ కార్యాచరణ కరువైందన్న విషయం ఆ పార్టీ నేతల ద్వారా బహిర్గతమవుతోంది. నేతల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు, పార్టీ నిర్ణయాల్లో అభిప్రాయ భేదాలు సమసిపోయే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది.
ప్రాదేశిక ఎన్నికలు బీజేపీకి విషమ పరీక్షే..
రానున్న ప్రాదేశిక ఎన్నికలు తెలంగాణాలో బీజేపీకి విషమ పరీక్షగా మారుతున్నాయి. మెయిన్స్‌కు ముందు ప్రిలిమ్స్ పాస్ కావాలన్నట్లుగా 2028 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీకి త్వరలో వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే రాజధాని నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు సవాళ్లు విసురుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతానికి భిన్నంగా కమలం పార్టీ కొత్త వ్యూహంతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఎక్కడా కలిసి రావడం లేదు.
రాష్ట్ర స్థాయి కాషాయ దళం నేతలంతా కలిసికట్టుగా ఇక క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలనుంటే ఇప్పటికే దెబ్బతిన్న కార్యకర్తల మనోభావాలు సమస్యాత్మకమవుతున్నాయి. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ దూతలను రంగంలోకి దింపేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నా.. ఆ మద్ధతును ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా పోతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్‌తో పాటు అనుబంధ సంస్థల బలగాలు కూడా అత్యంత కీలకంగా పని చేయడానికి సిద్దంగా ఉన్నా.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిదులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సంఘ్ పరివానర్ నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
బెంగాల్లో ఫలించిన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టి తెలంగాణాలో అమలు చేయాలన్న అంశంపై రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా.. గత రెండు రోజులుగా పార్టీ పదాధికారుల సమావేశంలో మార్గనిర్ధేశం చేసినప్పటికీ ఫలితం కనిపించకుండా పోతోంది. అగ్రనేత అమిత్ షా ఆలోచనల ప్రకారం.. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి సంఘ్ పరివార్‌కు చెందిన అన్ని విభాగాల బృందాలను రాష్ట్రానికి రప్పించి కీలక బాద్యతలు అప్పగించాలన్న అధిష్టానం యోచన, కార్యాచరణ దాదాపు నిర్వీర్యమైనట్లేనని తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.
కొద్ది నెలల క్రితం నాటి కార్యాచరణ ఇదే, కానీ…
అయోమయం, అస్తవ్యస్తం అన్నట్లుగా తయారైన తెలంగాణ బీజేపీలో ఐదారు నెలల క్రితం పకడ్భందీ కార్యాచరణ కనిపించింది. దేశ భద్రత, జాతీయతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), యువతను మేల్కొలిపేందుకు పనిచేస్తున్న ‘భజరంగ్ దళ్’, ప్రపంచ వ్యాప్తంగా హింధూ ధర్మ పరిరక్షణ, ప్రచార బాధ్యతలను భుజానెత్తుకుని పనిచేస్తున్న ‘విశ్వహిందూ పరిషత్’, విదేశీ వస్తువులను బహిష్కరించి దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరిచేందుకు పనిచేస్తున్న ‘స్వదేశీ జాగరణ్ మంచ్’, ప్రారిశ్రామిక రంగాభివృద్ధికి పనిచేస్తున్న ‘లఘు ఉద్యోగ్ భారతి’, గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్న ‘వనవాసి కళ్యాన్ ఆశ్రమం’, ఆర్ఎస్ఎస్ తరహాలోనే మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న ‘రాష్ట్రీయ సేవికా సమితి’, పాఠశాల విద్యా వ్యవస్థను జాగృతం చేస్తున్న ‘విద్యా భారతి’ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందాలు ప్రతి నెలలో రెండు పర్యాయాలు తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నాయి.
స్థానిక పరిస్థితులను, పరిణామాలను, పార్టీ బలాబలాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అధిష్టానానికి అందజేయనున్నారు. అలాగే నాయకుల మధ్య సమన్వయ లోపం, అందుకు గల కారణాలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలను అధిష్టానం సూచించనుంది.
అదే సమయంలో బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న విద్యార్థి విభాగం బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రస్తుత రాజకీయాల్లో విద్యార్థుల అవసరం, ప్రమేయాన్ని గుర్తు చేయనున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. 2028 సార్వత్రిక ఎన్నికల్లో భావి భాగస్వామ్యం కూగా అత్యంత క్రియాశీలకమై ప్రజాబలం నాలుగింతలు పెరిగేందుకు అవకాశాలు కళ్లముందు ఉన్నప్పటికీ, నేతల మధ్య క్రమక్రమంగా పెరుగుతున్న అంతర్గత విభేదాలు అనుబంధ సంఘాల కార్యాచరణను భగ్నం చేస్తున్నాయి.
కార్మిక వర్గాన్ని మేల్కొలిపేందుకు మరో వ్యూహరచణ..
కార్మిక రంగాన్ని మేల్కొలిపి వారి హక్కులను పరిరక్షించే దిశగా ‘బీజేపీకి మరో అనుబంధ సంస్థ ‘భారతీయ మజ్ధూర్ సంఘ్’ పరివార్ పనిచేయనుంది. వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న చేయూత, దేశ నిర్మాణంలో రైతలు భాగస్వామ్యంపై అవగాహన కల్పించి వారిని రాజకీయాల్లో క్రియాశీలకం చేసేందుకు ‘భారతీయ కిసాన్ సంఘ్’ రాజకీయ చదరంగంలోకి దిగనుంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆలోచనల మేరకు అంతర్గతంగా పక్కా ప్రణాళికతో బీజేపీ రాజకీయ వ్యూహాన్ని రచిస్తోందని, దాని అమలు తర్వాత తమ పార్టీని తట్టుకోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సాధ్యం కాదన్న ధీమా ముఖ్య నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఆ ప్రణాళిక ప్రకారం.. ముందుగా రాష్ట్రమంతటా గ్రామ స్థాయి వరకూ కమిటీలను బలోపేతం చేయనున్నారు.
వచ్చే పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో బల నిరూపణకు కసరత్తు చేసి బలాన్ని నిరూపించుకోనున్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల వ్యూహాలకు, ఆలోచనలకు భిన్నంగా ఈ రెండు ఎన్నికల్లో ధీటైన పోటీ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రతిపాదిత పథకాలే ప్రచారాస్త్రంగా, ప్రధాన అజెండా పార్టీ యంత్రాంగమంతా పనిచేయనుంది. ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
సంస్థాగత సమస్యలు, సవాళ్లు సమసిపోవాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభీష్టం మేరకు నిర్ణయాలు జరగాలని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పదాధికారులకు గత రెండు రోజులుగా దిశానిర్ధేఉశం చేస్తూ వస్తున్నారు. ఆ ప్రకారం వారం, పది రోజుల్లోగా తెలంగాణ బీజేపీ రాజకీయ కార్యాచరణ సిద్ధం కానున్నదని తెలుస్తోంది. కానీ రాష్ట్ర పార్టీ నేతల మధ్య కొరవడిన సమన్వయం ఆ వ్యూహాన్ని ముందుకు సాగనీయడం లేదని సంఘ్ పరివార్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
