రోడ్డు ప్రమాదంలో కిరాణా వ్యాపారి దుర్మరణం
ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం.. తలకు తీవ్ర గాయాలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగాపూర్‌కు చెందిన కిరాణా వ్యాపారి జాదవ్ శైలు (58) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై నార్నూర్ మండలం నాగల్‌కొండ వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు నాగాపూర్ సర్పంచ్ కల్పన సునీల్ జాదవ్, ఓబీసీ మండల అధ్యక్షుడు మధుకర్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శైలు మృతి పట్ల నాయకులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
