పవన్ ఆదేశాలతో గ్రీన్ డ్రైవ్!
- తొలి దశలో 26 పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం లక్ష్యం
- 129 ఎకరాల్లో 43,300 మొక్కలు నాటిన పారిశ్రామిక సంస్థలు
ఆంధ్రప్రభ, అమరావతి: పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పరిశ్రమల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రతి పరిశ్రమ పరిధిలోని భూమిలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తొలి దశలో జిల్లాకు ఒక పరిశ్రమ చొప్పున 26 పరిశ్రమలను ఎంపిక చేసి 14 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జూలై 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 11న ముగిసింది. ఈ సమయంలో ఎంపిక చేసిన పరిశ్రమలు నిర్దేశించిన పచ్చదనం లక్ష్యాలను సాధించినట్లు అధికారులు తెలిపారు.

129 ఎకరాల్లో 43,300 మొక్కలు
ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 26 పరిశ్రమల పరిధిలో మొత్తం 129 ఎకరాల్లో 43,300 మొక్కలను నాటారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని మొక్కల ఎంపిక చేశారు. దేశీయ జాతులతో పాటు పండ్ల మొక్కలు, సుందరీకరణకు ఉపయోగపడే మొక్కలను నాటారు. వేప, కానుగ, రావి, నేరేడు వంటి మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం
పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల పరిసరాల్లో పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూమిలో నిర్ణీత మేరకు పచ్చదనం ఉండేలా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నారు.
మిగిలిన పరిశ్రమల్లోనూ అమలు
తొలి దశలో చేపట్టిన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన పరిశ్రమల్లోనూ 33 శాతం పచ్చదనం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ లక్ష్యాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంలో ప్రతి శాఖ, ప్రతి పరిశ్రమ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

