వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి పల్లకి సేవ

  • భక్తులతో కిటకిటలాడిన ఆలయం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా స్వామివారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి, పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చనలు, పూజలు, మహా మంగళహారతి నిర్వహించారు.

భూదేవి, శ్రీదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు రేగటి నాగరాజు, ఈఓ సాకే రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథ్‌ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ, రామకృష్ణ, మండల టీడీపీ కన్వీనర్‌ మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.