ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం

స్వామివారి ఆశీస్సులు పొందిన విప్ ఆది
వేములవాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌:
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లిలో కొలువైన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆలయాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని అన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఇటువంటి ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వేములవాడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూము మధు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అర్చక బృందం, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.