నిబద్ధతతో సేవలందించిన ఎస్‌ఐలకు ఘన వీడ్కోలు

కిష్టారెడ్డి, పవన్‌, రఫ్ఫిక్‌ సేవలు ప్రశంసనీయం
ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం గొప్ప విషయం: ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: ఉద్యోగ జీవితంలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందడం ఎంతో గొప్ప విషయమని జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఎస్‌ఐలు కిష్టారెడ్డి, పవన్‌, రఫ్ఫిక్‌లకు సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

పోలీసు శాఖలో సుదీర్ఘకాలం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన అధికారుల సేవలను ఎస్పీ అభినందించారు. ఉద్యోగి విజయవంతంగా విధులు నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల సహకారం, బాధ్యత కూడా కీలకమని పేర్కొన్నారు. ఎస్‌ఐ కిష్టారెడ్డి సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఎస్‌ఐ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధత, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.

ఎస్‌ఐ పవన్‌ కూడా సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలతో పాటు గ్రేహౌండ్స్‌ విభాగంలో ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించారని ఎస్పీ తెలిపారు. సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా పదోన్నతులు పొందడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఎస్‌ఐ రఫ్ఫిక్‌ సైతం సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు.

ముగ్గురూ ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, పరిపాలనా అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సదా నాగరాజు, ఆర్‌ఐ సురేష్‌, పదవీ విరమణ పొందుతున్న ఎస్‌ఐల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు జనార్ధన్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.