ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

ఆలేరు శ్రీరంగ క్షేత్రంలో పూజ‌లు

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జాతీయ శ్రీ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీరంగనాయక స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేషాలంకరణలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం పొందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనడంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడాయి.