ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో పూల పండుగ వేడుకలు
- ఆటపాటలతో సందడి చేసిన మహిళలు..
- ఆడపడుచులకు వాయినం అందించిన అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పండుగ వేడుకలతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాలు సమర్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు జరుపుకునే ఈ పూల పండుగకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. గతంలో భూస్వాములు, దొరల ఆధిపత్యంలో బడుగు, బలహీన వర్గాల మహిళలు బతుకమ్మ ఆడితే.. ఇతరులు ప్రేక్షకులుగా ఉండేవారని చెప్పారు. నేడు ఈ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన పార్టీ తెలుగుదేశమని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు ధీటుగా టీడీపీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా ప్రజల్లో మరింత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. గౌరీమాత ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భవన్‌లో ఇంత వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం మహిళలందరికీ ఆనందాన్ని కలిగించిందన్నారు. బతుకమ్మ మహిళల పండుగ అని, వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీకి, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన తెలుగుమహిళలందరికీ అభివాదం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళలకు ధైర్యాన్ని, శక్తిని అందించే వేడుక అని అన్నారు. తొమ్మిది రోజులపాటు గౌరీమాతను ప్రకృతికి ప్రతిరూపంగా భావించి రంగురంగుల పూలతో పూజించడం తెలంగాణ సంప్రదాయమని పేర్కొన్నారు. సమసమాజ ఆకాంక్షను ప్రతిబింబించే ఈ పండుగ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. వేడుకల నిర్వహణకు సహకరించిన అరవింద్ కుమార్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర పార్టీ మాజీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ.. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి తొమ్మిది రోజులపాటు గౌరీమాత రూపంలో ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఆడపడుచులకు వాయినం
బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆడపడుచులకు అన్నగా వాయినం అందించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఎన్టీఆర్ భవన్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ మహిళా నాయకులు సూర్యదేవర లత, సుభాషిణి, చాడ మరియా, కృష్ణవేణి రెడ్డి, ఆశాబిందు, ప్రమీళ, సంధ్యారాణి, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, అజ్మీరా రాజునాయక్, జివిజి నాయుడు, మీడియా కమిటీ ఛైర్మన్ తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి, గుళ్లపల్లి ఆనంద్, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, సంధ్యపోగు రాజశేఖర్, జనగాం నర్సింగ్ రావు, యానాల అనంతరెడ్డి, ఎంకె బోస్, పోలంపల్లి అశోక్, శ్రీపతి సతీష్, యాదీలాల్ తదితరులు హాజరయ్యారు.







