వికసిత్ భారత్ లక్ష్యంగా.. శాస్త్ర విజ్ఞానమే చోదకశక్తి

స్టెల్లాలో ఘనంగా ఆల్కెమీ ఫెయిర్‌..
ఆకట్టుకున్న విద్యార్థుల శాస్త్రీయ ప్రదర్శనలు

పటమట, ఆంధ్రప్రభ: విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ @2047 కోసం సైన్స్’ ఇతివృత్తంతో రెండు రోజుల ఆల్కెమీ ఫెయిర్‌–2026ను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, తరగతి గది బోధనను వాస్తవ ప్రపంచ అనువర్తనాలతో అనుసంధానం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ప్యానెల్ సభ్యుడు, సైన్స్ ప్రమోటర్ లక్ష్మణ సూరి ఉపద్రస్త ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిశోధన, ఆవిష్కరణల్లో యువత కీలక శక్తిగా ఎదగాలని అన్నారు. భారత్‌ పరిశోధన, ఆర్థిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత చేపట్టే నూతన ఆవిష్కరణలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.

సుస్థిరతకు ప్రాధాన్యమిస్తూ సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే పరిశోధనలు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిస్టర్‌ ఇన్నియసమ్మ గాదె మాట్లాడుతూ దైనందిన జీవితంలోని ప్రతి అంశం సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. దేశ నిర్మాణంలో శాస్త్ర విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ కుతూహలాన్ని పెంపొందించుకుని ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఫెయిర్‌లో భాగంగా విద్యార్థులకు ఎలిమెంట్‌ క్విజ్‌, ఉప్పుల గుర్తింపు, ఆహార కల్తీ నిర్ధారణ పరీక్షలు, రసాయన బంధాల నమూనాలు, 40 రకాల మొక్కల ప్రదర్శన తదితర పోటీలు నిర్వహించారు. డ్యాన్సింగ్ బాల్స్‌, లిక్విడ్ కలర్ ఎఫెక్ట్స్‌, కెమికల్ బ్లడ్‌, స్మోక్ వితౌట్ ఫైర్ వంటి ప్రయోగాత్మక ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆల్కెమీ ఫెయిర్‌ను సందర్శించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రసాయన శాస్త్ర విభాగాన్ని ప్రిన్సిపాల్‌ అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ వాణి లత, ఇంటర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీమతి శాంతకుమారి, సైన్స్‌ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.