గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి? కాంగ్రెస్‌లో ఆశావహుల పోటీ

  • సామాజిక సమీకరణాలతో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహానికి పదును
  • ఐదు ఎమ్మెల్సీ స్థానాల అనేక మంది గురి.. నేతల్లో పెరుగుతున్న ఆశలు
  • ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే రెండు స్థానాలకు సత్తా చాటిన నేతలకే ఛాన్స్‌?
  • గవర్నర్‌ కోటాలో మూడు స్థానాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ప్రాధాన్యం?
  • అధిష్ఠానం నిర్ణయంపైనే ఉత్కంఠ.. ఎవరికి దక్కనుంది అవకాశం?
  • ఐదు ఎమ్మెల్సీ స్థానాలు.. అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సందడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో, ఆయా స్థానాలను ఎవరికి కేటాయించాలన్న అంశంపై అధికార కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఐదు స్థానాల్లో రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఉండగా.. మరో మూడు స్థానాలు గవర్నర్‌ కోటాలో నామినేట్‌ పద్ధతిలో భర్తీ కానున్నాయి. దీంతో పార్టీ కోసం పనిచేసిన నేతలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశం కూడా కీలకంగా మారనుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్‌ పార్టీలో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో పదవులు ఆశించిన నేతలకు ఇప్పటివరకు అవకాశం దక్కని పరిస్థితిలో.. తాజా ఖాళీలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసిన నేతలు, ఎన్నికల సమయంలో పార్టీ కోసం వ్యయ, ప్రయాసలు ఓర్చి పనిచేసిన నాయకులు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాల విషయంలో పార్టీ వ్యూహం భిన్నంగా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియలో పోటీ- చేసి రాజకీయంగా తమ సత్తా చాటగలిగే నాయకులకు ఈ స్థానాల్లో అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ స్థానాల కోసం పోటీ- పడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, పార్టీ అధిష్ఠానం ఎలాంటి సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటు-ందన్నది ఆసక్తికరంగా మారింది.

గవర్నర్‌ కోటాలో భర్తీ కానున్న మూడు స్థానాల విషయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్నవారు, ఉద్యమ కాలం నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్నవారికి ప్రాతినిధ్యం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు, ఆ సామాజిక సమీకరణాలతోనే అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన పలువురు నేతలు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తమకు తగిన రాజకీయ గుర్తింపు దక్కలేదన్న అభిప్రాయంతో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కోటా పదవులను అలాంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది.

రేవంత్‌ సామాజిక వ్యూహానికి ఎమ్మెల్సీ ఎంపికలు మరో పరీక్ష?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా అదే వ్యూహంలో భాగంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐదు స్థానాలకు అనేక మంది ఆశావహులు ఉండటంతో, అందరినీ సంతృప్తిపరచడం పార్టీ నాయకత్వానికి సవాలుగా మారనుంది. పదవులు దక్కని నేతలకు భవిష్యత్తులో ఇతర అవకాశాలు కల్పిస్తామన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండనుంది. ఎమ్మెల్సీ పదవుల భర్తీలో సీఎం రేవంత్‌ అభిప్రాయంతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం కూడా కీలకం కానుంది.

ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే స్థానాల్లో రాజకీయంగా చురుకైన నేతలకు అవకాశం ఇవ్వడం, గవర్నర్‌ కోటాలో సామాజిక ఉద్యమ నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. మొత్తంగా.. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలకు మరో పరీక్షగా మారాయి. సమాజిక సమీకరణాల్లో ఎవరి వాటా ఎంత? ఎవరికి ఎన్నికల బరిలో అవకాశం దక్కుతుంది? ఎవరికి గవర్నర్‌ కోటా ద్వారా పదవి వరిస్తుంది? అన్న ప్రశ్నలకు పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయంతో త్వరలోనే తెరపడనుంది.

బీసీలు, ఉద్యమకారులు, మహిళల్లో సానుకూలత లక్ష్యంగా..

వచ్చే నెలలో (నవంబర్‌లో) ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై అధికార కాంగ్రెస్‌లో కసరత్తు ఊపందుకుంది. ఇప్పటికే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించగా.. తాజాగా తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుమార్తె డాక్టర్‌ పవిత్రవాణి పేరు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదం అవసరమని కూడా ఆయన స్పష్టం చేసినట్లు- తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రవాణి పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణం రెండింటినీ కలిపే అవకాశం పవిత్రవాణి ఎంపిక ద్వారా లభిస్తుందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులు, వారి కుటుంబాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలోనూ ప్రస్తావించింది. ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తోంది. 2026 ఏప్రిల్‌లో గవర్నర్‌ ఆయనతో పాటు- మహ్మద్‌ అజారుద్దీన్‌ నియామకాలకు ఆమోదం తెలిపారు. ఇదే క్రమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుటు-ంబానికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని రాజకీయంగా ప్రదర్శించవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

మూడు సీట్లు.. విస్తృత సామాజిక సమీకరణాలు

నవంబర్‌లో గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. గోెరేటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌, బస్వరాజు సారయ్య పదవీకాలం నవంబర్‌ 14తో ముగియనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూడు స్థానాల భర్తీలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతున్నట్లు పలు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మూడు స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించే అంశాన్ని ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవిత్రవాణి పేరు ఖరారైతే.. అది కేవలం ఒక పద్మశాలి నాయకురాలికి అవకాశం కల్పించడంగానే కాకుండా తెలంగాణ ఉద్యమ వారసత్వం, బీసీ సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యాన్ని ఒకే నిర్ణయంలో ప్రతిబింబించే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు విశ్లేషించే అవకాశం ఉంది.

తెలంగాణ ఉద్యమకారులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శను రేవంత్‌రెడ్డి తరచుగా రాజకీయంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ తనను తాను ఉద్యమ వారసత్వానికి దగ్గరగా చూపించుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు, అయితే, పవిత్రవాణి పేరుపై అధికారిక నిర్ణయం వెలువడే వరకు దీనిని ప్రతిపాదన లేదా పరిశీలనగానే చూడాల్సి ఉంటు-ంది. మూడు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. తాజా నివేదికల ప్రకారం పవిత్రవాణి పేరు మాత్రం ఈ దశలో ప్రధానంగా చర్చలోకి వచ్చింది.