ప్రభుత్వానికి–ప్రజలకు అనుసంధానకర్తలు

  • జీపీవోల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. పరిష్కారానికి కృషి చేస్తా
  • జీపీవోల ప్రథమ మహాసభలో నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామ పాలనాధికారులు (జీపీవోలు) కీలక అనుసంధానకర్తలుగా పనిచేస్తున్నారని డీసీసీ మాజీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జీపీవోల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన జీపీవోల ప్రథమ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని ఆరోపించారు. భూ వ్యవహారాల్లో అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే వీఆర్వో వ్యవస్థను తొలగించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామస్థాయిలో పరిపాలనా సేవలను మరింత సమర్థంగా అందించేందుకు గ్రామ పాలనాధికారుల సేవలను వినియోగించుకుంటోందన్నారు. రానున్న రోజుల్లో జీపీవోలను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అనంతరం జీపీవోల సంఘం ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను నిర్మలా జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీపీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మల్లారం అర్జున్, విజయ్, రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చిరంజీవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పృథ్వీరాజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుజాత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.