ప్రభుత్వం ముందస్తు చర్యలు..

ప్రభుత్వం ముందస్తు చర్యలు..

మొంథా తుఫాన్‌ బీభత్సంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం మొంథా తుఫానుగా మారి వేగంగా ముందుకు కదులుతోంది. ఈ మేర‌కు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు.

ప్రస్తుతం ఈ తుఫాన్‌ కాకినాడకు సుమారు 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మంగళవారం మొంథా తుఫాన్‌ ఉత్తర–వాయవ్య దిశలో కదిలి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది.

తీరాన్ని తాకే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుఫాన్‌ ప్రభావం తెలంగాణపైనా పడనుంది. వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సోమవారం నాగర్‌కర్నూల్‌, నల్గొండ‌, సూర్యాపేట‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల సూచన ఉన్నందున ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

మొత్తం 19 జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రం కానుందని అంచనా. ఆదిలాబాద్‌, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

అలాగే నిర్మల్‌, మంచిర్యాల‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై, మునిసిపల్‌ అధికారులు, విపత్తు నిర్వహణ దళాలకు ముందస్తు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు

తుఫాన్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టార్పాలిన్లను వినియోగించి రైతుల ధాన్యాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు అమ్మిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply