ప్రభుత్వ పనితీరు మెరుగు పరుచుకోవాలి

కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదని చప్పట్లు కొట్టారు
నియోజక వర్గంను చిన్న చూపు చూశారు
సీఎం చంద్రబాబు పర్యటనపై వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ఫైర్

నర్సాపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రప్రభ): కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ప్రభుత్వ పనితీరును మెరుగుపరచుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ స్థానిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి స్పష్టమైన హామీ, నిధుల మంజూరు జరగలేదని విమర్శించారు.

బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరాజు మాట్లాడుతూ.. సీఎం పర్యటన ‘వచ్చారు.. వెళ్లారు’ అన్నట్లుగా సాగిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి ఉపయోగపడే ఒక్క అంశం కూడా పర్యటనలో లేదన్నారు. అధికారుల పనితీరుపై విమర్శలు చేసి, సమస్యలకు ఇతరులపై నెపం మోపడం, నిధులు మంజూరు చేయకపోవడం మినహా పర్యటన వల్ల ప్రయోజనం కనిపించలేదని ఆరోపించారు.

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదని ప్రసాదరాజు విమర్శించారు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప అభివృద్ధి పనులు కనిపించడం లేదని ఆరోపించారు.

మున్సిపాలిటీలో తాగునీరు, పారిశుధ్యం అధ్వానం

నర్సాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. పీచుపాలెం, చినమామిడిపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన మంచినీటి ట్యాంకులకు ఇప్పటికీ కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మరోవైపు హౌసింగ్‌ శాఖ ద్వారా ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోయినా ఆ శాఖ పనితీరుకు చప్పట్లు కొట్టించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆక్వా రైతులపై ఫీడ్‌ భారం

ఆక్వా ఫీడ్‌ ధరల పెరుగుదలతో రైతులపై అదనపు భారం పడుతోందని ప్రసాదరాజు తెలిపారు. ఇప్పటికే రూ.10 నుంచి రూ.14 వరకు ఫీడ్‌ ధరలు పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేశారని, తాజాగా మరో రూ.9 పెంచడం ద్వారా ఆక్వా రైతులపై మరింత భారం మోపారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు కూడా కరువు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పనిచేయాలని ప్రసాదరాజు సూచించారు. సమావేశంలో పీఏసీ సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.