శ్రీకృష్ణాష్టమిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలకు రూపకల్పన చేయాలి.. సహస్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ చినుకని శివ ప్రసాద్‌

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ప్రత్యేక రాష్ట్రస్థాయి వేడుకలకు రూపకల్పన చేయాలని సహస్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ చినుకని శివ ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణుడి జీవితం, భగవద్గీత బోధనలు ధర్మం, కర్తవ్యనిష్ఠ, న్యాయం, సమాజ శ్రేయస్సుకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.

యువతలో నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేలా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, ప్రసంగం, సాంస్కృతిక పోటీలు నిర్వహించడంతో పాటు భగవద్గీతలోని మానవతా, నైతిక సందేశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.

శ్రీకృష్ణాష్టమిని ప్రతి ఏటా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రత్యేక మార్గదర్శకాలతో కూడిన విధానాన్ని రూపొందించాలని డాక్టర్‌ శివ ప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతకు విలువల ఆధారిత జీవనం, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించవచ్చని పేర్కొన్నారు.