ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట
- ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం..
- ఆయిల్‌పామ్‌కు ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు
- ఉద్యాన రంగ అభివృద్ధికి రూ.1,000 కోట్ల కార్యాచరణ..
- ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం శాసనసభలో ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఉద్యాన పంటల సాగు విస్తరణకు అవసరమైన మొక్కలు, ఎరువులు, మల్చింగ్, షేడ్‌నెట్, ఫామ్పాండ్లు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర సేద్యం వంటి సదుపాయాలను నిబంధనల ప్రకారం 40 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీపై అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2026–27లో మొక్కలు, మల్చింగ్, షేడ్‌నెట్, కోత అనంతర నిర్వహణ సదుపాయాలు, శీతల గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ, శాశ్వత పందిళ్ల కోసం రూ.150 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
రాష్ట్రంలో ప్రస్తుతం 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. జాతీయ తినదగిన నూనెల మిషన్–ఆయిల్‌పామ్ పథకం కింద 2021–22 నుంచి ఇప్పటివరకు 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2023 డిసెంబర్ నుంచి 1.37 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించామని చెప్పారు. 2026–27లో 85 వేల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 29,053 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వెల్లడించారు.
సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఈ పంటను ప్రోత్సహిస్తున్నామని తుమ్మల తెలిపారు. రైతులకు మొక్కలు, బిందు సేద్యం, మొదటి నాలుగేళ్లకు ఎరువులు, అంతర పంటల సాగు తదితరాలకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ఫామ్పాండ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను కూడా రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు.
ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025
ఆయిల్‌పామ్ చట్టం–1993 ప్రకారం ఫ్యాక్టరీ జోన్ కేటాయించిన ప్రతి ఆయిల్‌పామ్ కంపెనీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రతి నెలా గెలలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర ఉందన్నారు. కనీస హామీ ధర ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అయినప్పటికీ రైతులకు మరింత భరోసా కల్పించేందుకు కనీస హామీ ధర ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు.
కొత్తగా ఆరు ఆయిల్‌పామ్ మిల్లులు
రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట, అప్పారావుపేట, నర్మెట్టలో, గోద్రెజ్ ఆధ్వర్యంలో అంజనాపురంలో మిల్లులు ఉన్నాయని చెప్పారు. మరో ఆరు మిల్లుల నిర్మాణ పనులు కల్లూరుగూడెం, ఇంచెర్ల, పెద్దరాతు, రేగొండ/చిన్నపాక, యాచారం, శంకరంరెడ్డిపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాదికి ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రిఫైనరీ, ఆధునిక ప్యాకేజింగ్ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
10 వేల ఎకరాల్లో సాగు ఉంటే ఫ్యాక్టరీ ఏర్పాటు
ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తుమ్మల తెలిపారు. ఒక ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేయాలంటే కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట హార్వెస్టింగ్ దశకు రావాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అన్ని ఉమ్మడి జిల్లాల్లో మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని, జనగామ, మహబూబాబాద్ ప్రాంతాల్లో సాగు విస్తరిస్తున్నందున అదనపు ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కనీసం 10–15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తే అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం వరకు సబ్సిడీ
ఆయిల్‌పామ్‌కు మార్కెటింగ్ సమస్య ఉండదని మంత్రి తెలిపారు. పంట కొనుగోలుకు అవసరమైన ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, కోతుల బెడద, అడవి జంతువుల వల్ల కలిగే ఇబ్బందులు కూడా ఆయిల్‌పామ్ సాగుతో తగ్గుతాయని చెప్పారు. ఆయిల్‌పామ్ పంటకు ఎగుమతుల అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీలు, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు సబ్సిడీలు అందిస్తున్నామని వెల్లడించారు.
ఉద్యాన రంగానికి రూ.1,000 కోట్ల కార్యాచరణ
వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుని ఈ ఏడాది సుమారు రూ.1,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఫామ్పాండ్ల ఏర్పాటుకు కూడా సబ్సిడీ అందిస్తున్నామని, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఉచితంగా ఫామ్పాండ్లు తవ్వుకునే అవకాశం ఉందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని సూచించారు.
వరి పంటతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు తక్కువ నీరు అవసరమవుతుందని, మొక్కలు నాటిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు దిగుబడి అందించే అవకాశం ఉన్నందున రైతులు ఈ పంట వైపు దృష్టి సారించాలని మంత్రి కోరారు. జుక్కల్ నియోజకవర్గంలో బొప్పాయి మార్కెట్ ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ సుమారు 36 ఎకరాల్లో మాత్రమే బొప్పాయి సాగు జరుగుతున్నందున తక్షణం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. సాగు విస్తీర్ణం పెరిగి మార్కెట్ అవసరం ఏర్పడితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
