Government Information App |మొబైల్‌, వెబ్‌ యాప్‌ ప్రారంభించిన మంత్రి పార్థసారథి

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా చేరవేసే లక్ష్యంతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు సమాచారాన్ని స్వీకరించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు.ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేరవేయడంలో యాప్‌ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య మరింత బలమైన డిజిటల్‌ వారధిగా ఇది పనిచేస్తుందని వివరించారు.

ఒకే వేదికపై కీలక సమాచారం

మాన్యువల్‌ ప్రక్రియలను డిజిటల్‌ విధానంలోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం, ప్రజల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు యాప్‌ దోహదపడుతుందని మంత్రి తెలిపారు. యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకురావడంలో కృషి చేసిన సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్‌, ఐఏఎస్‌తో పాటు శాఖ అధికారులు, సాంకేతిక బృందాన్ని మంత్రి అభినందించారు.సరైన సమాచారాన్ని.. సరైన సమయంలో.. సరైన డిజిటల్‌ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవేసేలా సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ నుంచి కేడర్‌ మేనేజ్‌మెంట్‌ వరకు

శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, అవుట్‌డోర్‌ మీడియా, ఫ్యాక్ట్‌ చెక్‌, కేడర్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి ఈ డిజిటల్‌ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.ప్రభుత్వ సమాచార ప్రసారం, మీడియా నిర్వహణ, పౌర సంబంధాలు, వాస్తవాల ధ్రువీకరణ, ప్రకటనలు, కేడర్‌ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు.