ఉద్యోగులపై దాడులు హేయమైన చర్య
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
జిల్లా ఉద్యోగ జేఏసీ డిమాండ్
యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు, వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్, టీజీఓ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడటం సరికాదన్నారు. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులు ఏ సమస్యకూ పరిష్కారం కావని, ఉద్యోగుల పనితీరుపై అభ్యంతరాలు ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతిక దాడులకు దిగడం, దుర్భాషలాడటం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.
భూదాన్‌పోచంపల్లి పీహెచ్సీలో చికిత్స కోసం వచ్చిన దుద్యాల వెంకట తిరుపతి విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలు శ్వేతపై దాడి చేసి చెంపపై కొట్టడంతో పాటు స్టెతస్కోప్ లాక్కొని, అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి చేస్తూ కంప్యూటర్ను ధ్వంసం చేయడం దారుణమన్నారు. బొమ్మలరామారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కే. వెంకట్‌రెడ్డిపై బెజ్జెంకి వెంకట్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రమోద్‌రెడ్డిలు భౌతిక దాడికి పాల్పడటాన్ని ఖండించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్‌ను ఓ మహిళా కౌన్సిలర్ భర్త దుర్భాషలాడుతూ విధులకు అడ్డుపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షాంష్ యాదవ్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించి, నిందితులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం. కృష్ణ, టీఎన్జీఓ జిల్లా కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, మెడికల్ ఫోరం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ట్రెసా కలెక్టరేట్ అధ్యక్షుడు పి. రామారావు, కార్యదర్శులు మేఘలత, ప్రియాంకతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
