గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి..
- ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పాలకవర్గం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ సోమ కుమార్, ఉపసర్పంచ్ గుమ్మడి సోని విజయ్ కుమార్, వార్డు సభ్యులు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మంజూరైన నూతన పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
అప్పన్నపేట నుంచి రాగినేడు వరకు రహదారిని విస్తరించి బీటీ రోడ్డు నిర్మించాలని, గ్రామస్థులు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతులను బోన్ల ద్వారా పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్వే నెంబర్ 301ప్రభుత్వ భూమిలో విమానాశ్రయం కోసం గతంలో కేటాయించిన భూమిని యాజమాన్యం తిరిగి ప్రభుత్వానికి అప్పగించినందున, దానిని గ్రామపంచాయతీకి లేదా నిరుపేద కుటుంబాలకు సాగు కోసం కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
మహిళా సంఘాల భవనం, ముత్యాల కుంట చెరువుకు ఎస్సారెస్పీ కాలువ లైనింగ్, ఎస్సీ మాల కాలనీకి ప్రత్యేక వాటర్ ట్యాంకు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని, లో-వోల్టేజీ సమస్య పరిష్కారానికి అదనపు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు, నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
