గూగుల్ అనుబంధ సంస్థ భారీ పెట్టుబ‌డులు…

గూగుల్ అనుబంధ సంస్థ భారీ పెట్టుబ‌డులు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఈ భారీ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఈ డేటా సెంటర్ ప్రాజెక్టును విశాఖపట్నంలోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో నిర్మించనున్నారు.

విశాఖ తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లిలో మూడు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని నగరానికి రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానం చేయనున్నారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు

రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1,14,824 కోట్ల విలువైన పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 67,218 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కేవలం 15 నెలల్లోనే పెట్టుబడులపై చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు.

ఇప్పటి వరకు జరిగిన 11 SIPB సమావేశాల ద్వారా రాష్ట్రం రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 6.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది.

వివిధ రంగాల్లో కీలక ప్రాజెక్టులు..

తాజా SIPB సమావేశంలో ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరో స్పేస్, ఆటోమొబైల్, పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

వాటిలో ప్రధానమైనవి :

సౌర విద్యుత్ ప్రాజెక్టులు: అనంతపురం జిల్లాలో యాక్మే ఊర్జా మరియు టాటా పవర్ సంస్థలు చెరో రూ.2 వేల కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి.

పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టు: విజయనగరం జిల్లాలో చింతా గ్రీన్ ఎనర్జీ రూ.12,905 కోట్లతో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టును చేపట్టనుంది.

ఎఫ్.ఎం.సి.జి ప్రాజెక్టు: కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ రూ.758 కోట్లతో ఎఫ్‌ఎంసీజీ (Fast-Moving Consumer Goods) ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.

ఏరోస్పేస్ కాంపోనెంట్ ప్రాజెక్టులు: అనంతపురంలో రేమాండ్ – జేకే మైనీ రూ.940 కోట్లతో ఏరోస్పేస్ కాంపోనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి.

ఆతిథ్య రంగం: అమరావతిలో దస్పల్లా హోటల్స్ (రూ.200 కోట్లు), సదరన్ గ్లోబ్ హోటల్స్ (రూ.117 కోట్లు) కొత్త హోటళ్లను నిర్మించనున్నాయి.

భారత్ డైనమిక్స్: ప్రకాశం జిల్లాలో రూ.1,200 కోట్లతో ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.

ఇండస్ట్రియల్ పార్క్: విజయనగరంలో జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ రూ.531 కోట్లతో ఏర్పాటు కానుంది, దీని ద్వారా 45,000 ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, డేటా సెంటర్లతో విశాఖపట్నంలో కొత్త ఎకో సిస్టం ఏర్పడుతుంది. నగరం వచ్చే కాలంలో తదుపరి స్థాయి AI సిటీగా మారుతుంది. ఈ భారీ పెట్టుబడులు, ముఖ్యంగా డేటా సెంటర్ రంగంలో, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక ముఖ్యమైన టెక్ హబ్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించనున్నాయి… అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply