Google Job Exit Offer | ఏఐ దెబ్బకు ఉద్యోగుల సంఖ్య తగ్గించే ప్లాన్!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గూగుల్.. మరోవైపు కంపెనీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు దేశాల్లోని కొంతమంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని అందిస్తోంది. కాగా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్‌లోని కొన్ని విభాగాల ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
గూగుల్ ఈ స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని తొలుత 2025 ప్రారంభంలో కొన్ని విభాగాల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూన్‌లో మరిన్ని దేశాలకు విస్తరించింది. తాజాగా ఐదు దేశాల్లోని బృందాలకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ పథకం ద్వారా ఎంతమంది ఉద్యోగులు సంస్థను వీడనున్నారనే విషయాన్ని మాత్రం గూగుల్ వెల్లడించలేదు.
గూగుల్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు. ఏఐ పరిశోధన విభాగమైన డీప్‌మైండ్, గూగుల్ క్లౌడ్ వంటి కీలక విభాగాలు ఈ పథకం పరిధిలో లేనట్లు సమాచారం. ఏఐ, క్లౌడ్ సేవలపై గూగుల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈ విభాగాల్లో ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో కంపెనీకి కీలకమైన విభాగాల్లో పెట్టుబడులు, నియామకాలు కొనసాగిస్తూ.. ఇతర విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదా సిబ్బందిని పునర్వ్యవస్థీకరించడం గూగుల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
స్విట్జర్లాండ్‌లో ఇప్పటికే అమలు
ఈ పథకం ప్రభావం స్విట్జర్లాండ్‌లో కనిపిస్తోంది. అక్కడి ఉద్యోగులకు జూన్‌లోనే ఆఫర్ ఇవ్వగా, దాన్ని అంగీకరించిన కొందరు ఆగస్టు నుంచి సంస్థను వీడటం ప్రారంభించినట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌లో గూగుల్‌కు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండగా.. జ్యూరిచ్‌లో ప్రధాన ఇంజినీరింగ్ కేంద్రం ఉంది. ఈ పథకం ప్రకారం.. గూగుల్‌లో పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక నెల జీతం చొప్పున ఉద్యోగులకు పరిహారం ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 ఏళ్లుగా పనిచేస్తుంటే.. అతడికి 5 నెలల జీతం పరిహారంగా అందుతుంది. అయితే ఎంతకాలం పనిచేసినా గరిష్ఠంగా 12 నెలల జీతం మాత్రమే ఇస్తారు. స్విట్జర్లాండ్‌లో సుమారు 50 మంది పనిచేస్తున్న ఓ బృందంలో నలుగురు ఈ ఆఫర్‌ను అంగీకరించినట్లు సమాచారం.
మైక్రోసాఫ్ట్ కూడా ఇదే బాటలో..
ఏఐ రంగంలో పెట్టుబడులు పెంచుతున్న మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల సంఖ్యను పునఃసమీక్షిస్తోంది. అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లోని అర్హులైన ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశం కల్పిస్తూ బైఅవుట్ పథకాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ మైక్రోసాఫ్ట్‌లోని 70వ స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు వర్తిస్తుంది. మొత్తం 2.23 లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 60 వేల మందికి ఈ అవకాశం ఉండనున్నట్లు సమాచారం. ఆఫర్‌ను అంగీకరించిన ఉద్యోగులు డిసెంబర్ చివరి నాటికి సంస్థను వీడనున్నారు.
ఏఐ కోసం భారీగా ఖర్చులు
ఏఐ సేవలను అభివృద్ధి చేసేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఒకవైపు కొత్త సాంకేతికతపై పెట్టుబడులు కొనసాగిస్తూనే.. మరోవైపు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఏప్రిల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. జూలైలో మరో విడతలో 4,800 మంది ఉద్యోగులపై ప్రభావం చూపేలా సిబ్బంది తగ్గింపు చర్యలు చేపట్టింది. ఇప్పుడు స్వచ్ఛంద బైఅవుట్ ఆఫర్‌తో ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
